ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో దారుణం చోటు చేసుకుంది. ముప్పిడి వివేక్ అనే వ్యక్తి.. నలుగురు మహిళలపై గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో జీలుగులమ్మ (47) తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందింది. చుక్కమ్మ (60) పరిస్థితి విషమంగా ఉంది. ఉషారాణి, ధనలక్ష్మీకి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితుడు వివేక్ పరారీలో ఉన్నట్లు సమాచారం. కుటుంబ కలహాలు, పొలం సరిహద్దు విషయంలో గొడవ కారణంగా వివేక్ ఈ దాడికి పాల్పడ్డాడని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న డీఎస్పీ రవి చంద్ర, సీఐ సుభాష్ ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.