Hyderabad: ఆస్తి కోసం కూతురిని చంపేసి.. మృతదేహాన్ని మూసీ నదిలో పూడ్చి..
మేడ్చల్ జిల్లాలోని మేడిపల్లి పరిధిలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. మహేశ్వరి అనే యువతి గత నాలుగు నెలల క్రితం అదృశ్యమైంది.
By అంజి
Hyderabad: ఆస్తి కోసం కూతురిని చంపేసి.. మృతదేహాన్ని మూసీ నదిలో పూడ్చి..
మేడ్చల్ జిల్లాలోని మేడిపల్లి పరిధిలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. మహేశ్వరి అనే యువతి గత నాలుగు నెలల క్రితం అదృశ్యమైంది. అయితే తండ్రి ఈనెల రెండవ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి... ఆస్తి కోసం సవతి తల్లి యువతిని హత్య చేసింది అని నిర్ధారణ కావడంతో పోలీసులు అవాక్కయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మేడిపల్లి పోలీస్ స్టేషన్ బోడుప్పల్ పరిధిలో ఉన్న లక్ష్మీ నగర్ కాలనీలో జటోత్ పీనా(55) అనే వ్యక్తికి ఒక కూతురు కొడుకు ఉన్నారు. అనివార్య కారణాలవల్ల మొదటి భార్య తో విడాకులు తీసుకున్నాడు. అయితే మొదటి భార్య కొడుకు తల్లి వద్ద ఉండగా.. కూతురు మహేశ్వరి తండ్రి పీనా వద్ద ఉంటోంది. తండ్రి పీనా.. లలిత అనే మరో మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కూతురు ఉంది. పీనాకు బోడుప్పల్ ప్రాంతంలో రెండు ఇళ్లు ఉన్నాయి. అయితే మహేశ్వర్ కి పెళ్లి చేయాలని నిర్ణయించుకొని... కట్నంగా ఒక ఇల్లు కూడా ఇవ్వాలని తండ్రి పినా నిర్ణయించుకున్నాడు. ఈ విషయం తన రెండో భార్య లలితకు చెప్పాడు. అయితే రెండు ఇండ్లు తన కూతురికి మాత్రమే కావాలని మహేశ్వరికి ఎటువంటి ఇల్లు ఇవ్వద్దు అంటూ భర్తతో గొడవ పడింది.. అందుకు భర్త నిరాకరించాడు.
ఈ క్రమంలోనే సవతి తల్లి లలిత ఎలాగైనా సరే మహేశ్వరిని అంతం చేయాలని నిర్ణయించుకుంది. ఆ తర్వాత సవతి తల్లి లలిత తన మేన బావ రవికి విషయం చెప్పింది.. పథకం ప్రకారమే లలిత, రవి, మరో వ్యక్తి ఈ ముగ్గురు కలిసి గత డిసెంబర్ 7వ తేదీన మహేశ్వరి తండ్రి పీనా డ్యూటీకి వెళ్ళిన సమయంలో బోడుప్పల్ ప్రాంతంలో మహేశ్వరిని హత్య చేశారు... హత్య చేసిన అనంతరం రవి గ్రామమైన సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలంలోని కొమ్మాల గ్రామానికి దగ్గరలోని నల్గొండ జిల్లా, శాలిగౌరారం మండలం లో ఉన్న వంగమర్తి వద్ద అదే రోజు రాత్రి 11 గంటల సమయం లో మహేశ్వరి డెడ్ బాడీని మూసీ నదిలో పూడ్చిపెట్టారు.
సుమారు నాలుగు నెలలు గడుస్తున్నా కూడా మహేశ్వరి జడ తెలియకపోవడంతో తండ్రి పీన తీవ్ర ఆందోళనకు గురై మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్న సమయంలో సవతి తల్లి లలితపై అనుమానం వచ్చి ఆమెను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం బయటపడింది. దీంతో మేడపల్లి పోలీసులు సవతి తల్లి లలిత, మేన బావ రవి, మరో వ్యక్తి ఈ ముగ్గురు కలిసి మహేశ్వరుని హత్య చేసినట్లుగా నిందితులు ఒప్పుకున్నట్లుగా తేలింది. నిందితులు చెప్పిన సమాచారంతో వంగమర్తి లో మహేశ్వరి మృతదేహం వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. పోలీసులు ఈ ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.