హైదరాబాద్: గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కూతురు పుట్టిందని 14 రోజుల పసికందుని రెండు ముక్కలు చేసి నరికి చంపాడో తండ్రి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నేపాల్ కి చెందిన జగత్ విశ్వకర్మ (35), గౌరీ విశ్వకర్మ దంపతులు గత రెండు సంవత్సరాల నుంచి గుల్షన్ కాలనీలోని అఫ్జల్ గెస్ట్ హౌస్ పక్కన ఓ భవనంలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం కాగా.. మొదట కొడుకు పుట్టగా, రెండో సంతానంగా కూతురు పుట్టింది. అయితే రెండు సంవత్సరాల క్రితం కొడుకు చనిపోయాడు. ఇటీవల మూడో సంతానంగా మళ్లీ కూతురు జన్మించింది. మళ్లీ కూతురు పుట్టడంతో సైకోగా ప్రవర్తించిన తండ్రి మద్యం మత్తులో కూతురిని రెండు ముక్కలుగా నరికి సెవెన్ టుంబ్స్ దగ్గర పడేశాడు.
గౌరీ విశ్వకర్మ తన కూతురు కనిపించకపోవడంతో ఆందోళనకు గురై గోల్కొండ పోలీసులకి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు అనుమానం వచ్చి తండ్రిని విచారించగా తానే ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడని తెలిపాడు. నిందితుడు జగత్ భార్య చెప్పిన ప్రకారం.. జగత్ తరచుగా కోపం కోల్పోయి హింసాత్మకంగా ప్రవర్తించేవాడని చాలా హింస పెట్టేవాడని తెలిపింది. అదే కోపంతో ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడు, 14 రోజుల పసికందు అని కూడా చూడకుండా అతికిరాతంగా హత్య చేశాడు. ప్రస్తుతం అతను పోలీసు కస్టడీలో ఉన్నాడు. ఈ కేసు కు సంబంధించిన వివరాలను గోల్కొండ ఏసీపీ సయ్యద్ ఫయాజ్ తెలిపారు.