హైదరాబాద్ నగరంలో మరో దారుణం వెలుగు చూసింది. తనను వేధింపులకు గురి చేస్తున్నాడని భర్త మెడకు చున్నీ బిగించి హత్య చేసిందో భార్య. ఆపై తాగిన మైకంలో మంచం కోడు తగిలి చనిపోయాడని అందరిని నమ్మించింది. అయితే పోస్టుమార్టం రిపోర్ట్ ఆమె చేసిన ఘాతుకాన్ని బయటపెట్టింది. కూకట్‌పల్లి పీఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా నూజివీడు సమీపంలో తూర్పు దిగవల్లి గ్రామానికి చెందిన జగ్గవరపు సుధీర్ రెడ్డి (44)కి అదే ఏరియాకి చెందిన జ్ఞానప్రసన్నతో పెళ్లి జరిగింది. కొన్నేళ్ల నుంచి ఈ దంపతులు హైదరాబాద్‌లో ఉంటున్నారు. సుధీర్ రెడ్డి ఓ కంపెనీలో పని చేస్తుండగా.. భార్య ఇంట్లోనే ఉంటుంది. ఇద్దరికీ ఒకరిపై ఒకరికి అనుమానం ఉండేది. దీంతో ప్రతి రోజూ ఇంట్లో గొడవలు జరిగేవి.
ఈ క్రమంలోనే గతేడాది డిసెంబర్ 23న రాత్రి మద్యం మత్తులో భర్త మంచం కోడుకు తగిలి ప్రాణాలు కొల్పోయాడని భార్య జ్ఞానప్రసన్న తన బంధువులు, ఇరుగు పొరుగువారికి చెప్పింది. అయితే మృతుడి సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇటీవల వచ్చిన పోస్టమార్టం రిపోర్ట్‌లో సుధీర్‌రెడ్డి హత్య చేయబడ్డాడని తెలిసింది. దీంతో పోలీసులు ప్రసన్నను అదుపులోకి తీసుకుని విచారించగా.. తనను వేధిస్తున్నాడని, అందుకే హత్య చేశానని అంగీకరించింది. నిందితురాలిని మంగళవారం నాడు కోర్టులో హజరుపరిచారు.