హైదరాబాద్: ఓ భర్త తన భార్యను అతి కిరాతకంగా గొంతు కోసి చంపిన ఘటన బండ్లగూడా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బండ్లగూడా పోలీస్ స్టేషన్ పరిధిలో హస్మాబాద్ ఖాద్రియా మస్జీద్ దగ్గర్లోని బండ్లగూడా ఫైజ్‌లో నివాసం ఉంటున్న ఖురేషి (28) అనే వ్యక్తి.. వృత్తిరీత్యా ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అతడు పిసల్‌బండకి చెందిన ఖమర్ బేగం(24) అనే యువతిని 6 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే కొన్ని రోజుల నుండి ఇద్దరి దాంపత్య జీవితంలో కలహాలు మొదలయ్యాయి. చిన్నగా మొదలైన గొడవలు.. చిలికి చిలికి గాలి వానాలా పెద్దగా మారాయి.
ఈ క్రమంలోనే నిన్న అర్ధరాత్రి సమయంలో ఏదో విషయంలో భార్యపై భర్త ఫైజ్ ఖురేషి ఒక్కసారిగా కోపోద్రిక్తుడయ్యాడు. తన భార్య ఖమర్ పై కత్తితో దాడి చేసి ఆమె గొంతు కోసి హత్య చేయడమే కాకుండా... ఆమె మృతదేహాన్ని తగులబెట్టాడు. అనంతరం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. బండ్ల గూడా పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మంటల్లో కాలిపోయిన బాడీని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.