గ్యాంగస్టర్ అతీక్, అతడి సోదరుడిని కాల్చి చంపిన దుండగులు.. పోలీసుల సమక్షంలోనే ఘటన
రాజకీయ నాయకుడిగా ఎదిగిన ఉత్తరప్రదేశ్ గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ (60), అతడి సోదరుడు అష్రాఫ్‌లను గుర్తు తెలియని
By అంజి Published on 16 April 2023 1:46 AM GMTగ్యాంగస్టర్ అతీక్, అతడి సోదరుడిని కాల్చి చంపిన దుండగులు.. పోలీసుల సమక్షంలోనే ఘటన
రాజకీయ నాయకుడిగా ఎదిగిన ఉత్తరప్రదేశ్ గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ (60), అతడి సోదరుడు అష్రాఫ్‌లను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఘటన శనివారం రాత్రి 10 గంటల సమయంలో ప్రయాగ్‌రాజ్‌లో జరిగింది. ఓ మెడికల్ కాలేజీ దగ్గర కాల్పులు జరిగాయి. అతీక్ అహ్మద్ సమాజ్‌వాదీ పార్టీ తరఫున గతంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా పని చేశారు. 2005 బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్ హత్యతో సహా పలు నేరాలకు సంబంధించి అతిక్ మరియు అష్రఫ్ ఉత్తరప్రదేశ్ పోలీసుల అదుపులో ఉన్నారు. రాజుపాల్ హత్య కేసులో కూడా అతిక్ నిందితుడు. మెడికల్ టెస్టుల కోసం అతీక్, అష్రాఫ్‌లను తరలిస్తుండగా జర్నలిస్టుల్లా వారిని అనుసరిస్తూ ప్రశ్నలడుగుతున్న సమయంలో ముగ్గురు వారిపై తుపాకులతో అతి దగ్గరి నుంచి కాల్చి చంపారు.
మీడియా కెమెరాల ఎదుటే హత్య జరగ్గా, కాల్పుల్లో పాల్గొన్న ముగ్గురు వ్యక్తులు చేతులు పైకెత్తి ఘటనా స్థలంలో ఉన్న పోలీసులకు లొంగిపోవడం కనిపించింది. అతిక్ అహ్మద్ మరియు అష్రఫ్‌ల హత్యలో పాల్గొన్న ముగ్గురు షూటర్లను వెంటనే యుపి పోలీసులు పట్టుకున్నారు. ఒక పోలీసు కానిస్టేబుల్ మాన్ సింగ్‌కు స్వల్ప గాయమైంది. ముగ్గురు షూటర్లను లవ్లేష్ తివారీ, సన్నీ, అరుణ్ మౌర్యగా గుర్తించారు. మీడియా ప్రతినిధులుగా నటిస్తూ, షూటర్లు మీడియా ఐడీ కార్డులను తీసుకువెళ్లారు. వారి మైక్‌లపై ఎన్‌సీఆర్ ఛానెల్ అని వ్రాయబడింది. ఎఫ్‌ఎస్‌ఎల్ బృందం ఘటనా స్థలం నుంచి డమ్మీ కెమెరాలను స్వాధీనం చేసుకుంది.
పోలీస్ కమీషనర్ తెలిపిన వివరాల ప్రకారం.. ముగ్గురూ మీడియా ప్రతినిధులుగా నటించారు. ఈ ఘటనలో ఓ జర్నలిస్టు కూడా గాయపడ్డారని తెలిపారు. ఫోరెన్సిక్ బృందం మీడియాతో మాట్లాడుతున్న సమయంలో అతిక్, అష్రఫ్‌లను కాల్చి చంపిన ప్రదేశానికి చేరుకుంది. వీరిద్దరి హత్య తర్వాత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లా అండ్ ఆర్డర్ ఏడీజీ ప్రశాంత్ కుమార్‌ను పిలిపించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరుగుతోంది. అతిక్, అష్రఫ్‌లపై దాడిలో ఉత్తరప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ చేతికి గాయాలయ్యాయి. వెంటనే ఉత్తరప్రదేశ్ పోలీసు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (STF) సంఘటనా స్థలానికి చేరుకుంది.
ఉత్తరప్రదేశ్ అంతటా 144 సెక్షన్ బిగించబడింది. ప్రయాగ్‌రాజ్, సమీప జిల్లాల్లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF)తో సహా అదనపు బలగాలను మోహరించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పోలీసుల పెట్రోలింగ్ కొనసాగుతోంది. ఘటనపై సీఎంకు వివరించేందుకు డీజీపీ ఆర్కే విశ్వకర్మ, ఇతర అధికారులు సీఎం నివాసానికి చేరుకున్నారు. ఈ ఘటనపై ముగ్గురు సభ్యుల జ్యుడీషియల్ ప్యానెల్ విచారణ చేపట్టనుంది. దీనిపై ఉన్నతస్థాయి విచారణకు ముఖ్యమంత్రి ఆదేశించారు. సున్నితమైన జిల్లాల్లో నిరంతరం నిఘా ఉంచాలని అన్ని జోన్ల ఏడీజీ ఐజీని డీజీపీ ఆర్కే విశ్వకర్మ ఆదేశించారు. ఆదేశం ప్రకారం.. ప్రతి జిల్లాలోని సున్నిత ప్రాంతాలలో పోలీసు పెట్రోలింగ్ పెంచాలి.
హత్యలపై అతిక్ అహ్మద్ మాజీ న్యాయవాది వ్యాఖ్యానిస్తూ.. ''ఏది జరిగినా ఖండించదగినది. మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే హత్య పోలీసుల సమక్షంలోనే జరిగింది. కాల్పులు జరిగినప్పుడు నేను సంఘటన స్థలంలో ఉన్నాను. దుండగులు ఎవరో తెలుసు." అని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పరిరక్షించేలా అప్రమత్తంగా ఉండాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పోలీసు అధికారులను ఆదేశించారు. వదంతులను ఎవరూ పట్టించుకోవద్దని సీఎం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వదంతులు వ్యాపింపజేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎంఓ ఓ ప్రకటనలో పేర్కొంది.