చేతబడి అనుమానం.. భార్యాభర్తలను దారుణంగా చంపిన గ్రామస్థులు
అస్సాంలోని కర్బీ అంగ్లాంగ్ జిల్లాలో మూఢనమ్మకాల మంటలు మళ్లీ ఇద్దరి ప్రాణాలను బలిగొన్నాయి.
By - Medi Samrat |
అస్సాంలోని కర్బీ అంగ్లాంగ్ జిల్లాలో మూఢనమ్మకాల మంటలు మళ్లీ ఇద్దరి ప్రాణాలను బలిగొన్నాయి. చేతబడి చేస్తున్నారనే అనుమానంతో గ్రామస్తులు పదునైన ఆయుధాలతో దంపతులపై దాడి చేసి ఇంటికి నిప్పంటించారు. ఈ భీకర దాడిలో ఇద్దరూ సజీవదహనమయ్యారు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది.
మృతులను గార్డి బిరోవా (43 సంవత్సరాలు), అతని భార్య మీరా బిరోవా (33 సంవత్సరాలు)గా గుర్తించారు. సంఘటన నంబర్ 1 బెలోగురి ముండా గ్రామంలో జరిగింది.ఆ దంపతులు చేతబడి చేస్తూ చుట్టుపక్కల వారికి హాని కలిగిస్తున్నారని గ్రామస్థులు విశ్వసించారు. గ్రామస్తులు తొలుత దంపతుల ఇంట్లోకి ప్రవేశించి పదునైన ఆయుధాలతో దాడి చేశారు. ఆ తర్వాత ఇంటికి నిప్పంటించగా, అందులో ఇరువురు చిక్కుకుని కాలిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ ప్రాంతం మూఢనమ్మకాలలో కూరుకుపోయిందని ఓ పోలీసు అధికారి తెలిపారు. ప్రజలు వదంతులను నమ్ముతారు.. దీని కారణంగా చాలామంది బాధితులు అవుతున్నారు. కొన్ని సందర్భాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ఎంతో ప్రమాదకరం అన్నారు.
కర్బీ అంగ్లాంగ్ వంటి మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ మూఢనమ్మకాలు పాతుకుపోయాయి. అనారోగ్యం లేదా ఇబ్బంది వచ్చినప్పుడు ప్రజలు మంత్రవిద్య ద్వారా నయం చేసుకుందామని భావిస్తారు. దీంతో అమాయక ప్రజలు టార్గెట్‌గా మారుతున్నారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని అస్సాం ప్రభుత్వం 2015లో అస్సాం మంత్రగత్తె వేట (నిషేధం, నివారణ మరియు రక్షణ) చట్టాన్ని అమలు చేసింది. ఈ చట్టం చాలా కఠినమైనది. మంత్రగత్తె అని పిలిచి ఎవరినైనా చంపినా లేదా హింసించినా కఠిన శిక్ష, జరిమానా విధించే నిబంధన ఉంది. మూఢనమ్మకాలను అంతం చేసి బాధితులకు రక్షణ కల్పించడమే చట్టం ఉద్దేశం.