Hyderabad: లేట్ అయ్యిందని.. అమెజాన్ డెలివరీ బాయ్‌పై దాడి

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద బంధువు కేపీ విశాల్ గౌడ్ నేతృత్వంలోని కొందరు వ్యక్తులు కొట్టడంతో కొరియర్ డెలివరీ బాయ్ తీవ్రంగా గాయపడ్డాడు.

By అంజి  Published on  11 Aug 2023 6:31 AM IST
Hyderabad: లేట్ అయ్యిందని.. అమెజాన్ డెలివరీ బాయ్‌పై దాడి

మనం ఏదైనా ఆర్డర్ చేయగానే కొద్ది నిమిషాల్లోనే మన ముందు ఉండాలి అనుకుంటారు కొందరు.. కొద్దిసేపు డెలివరీ బాయ్స్ లేట్ అయ్యారంటే చాలు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నానా హంగామా సృష్టిస్తారు. మరికొందరైతే ఏకంగా వారిపై విరుచుకుపడి దాడికి పాల్పడతారు. ఇటువంటి సంఘటనే మేడ్చల్ జిల్లాలో జరిగింది. డెలివరీ కాసేపు లేట్ అయిందని అమెజాన్ డెలివరీ బాయ్‌పై దాడి చేసిన సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటన ఆగస్టు 5న జరిగింది. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద బంధువు కెపి విశాల్ గౌడ్ కు అమెజాన్ నుండి ఓ పార్సల్ డెలివరీ అయింది. అడ్రస్ సరిగ్గా తెలియకపోవడంతో కాసేపు ఆలస్యంగా రావడంతో విశాల్ గౌడ్, మరో ఏడుగురు స్నేహితులు డెలివరీ బాయ్ షేక్ రహన్ ఫయాజ్‌ని ఇంట్లోకి తీసుకెళ్లి కొట్టారు.

నిందితులు ఫయాజ్ కాలు విరిగిపోయేలా కొట్టారు. తీవ్రంగా గాయపడ్డ ఫయాజ్ చికిత్స నిమిత్తం ఊరికి వెళ్లి అనంతరం తిరిగి వచ్చి నేడు జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. "ఫయాజ్‌ వెంటనే శస్త్రచికిత్స చేయించుకోవాలి" అని అతని సోదరుడు అయాజ్ చెప్పాడు. బాధితుడు మహారాష్ట్రలోని నాందేడ్ నివాసి కాగా, గత ఆరు నెలలుగా హైదరాబాద్‌లోని ఓ ఈ-కామర్స్ సంస్థలో డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. అయాజ్ మాట్లాడుతూ.. ఒక ప్యాకేజీని డెలివరీ చేయడానికి ఫయాజ్‌ ఒక ప్రదేశానికి చేరుకున్నాడని చెప్పాడు. కస్టమర్ నంబర్‌కు కాల్ చేయగా, దానిని వేరే ప్రదేశానికి డెలివరీ చేయమని చెప్పారు. "అతను ఈ ప్రాంతానికి కొత్తవాడు కాబట్టి అక్కడికి చేరుకోవడానికి కొంత సమయం పట్టింది" అని చెప్పారు. సంఘటనా స్థలానికి చేరుకోగానే, ఆలస్యంగా వచ్చినందుకు క్షమాపణలు చెప్పాలని ఫయాజ్‌కు చెప్పారు.

''తెలుగులో మాట్లాడేవారు ఐదు నుంచి ఏడుగురు ఉన్నారు. తాను మహారాష్ట్రకు చెందినవాడినని, తనకు భాష అర్థం కాలేదని రెహాన్ వారితో చెప్పాడు'' అని అయాజ్ తెలిపారు. ఒక వ్యక్తి తన ఆధార్ కార్డు చూపించమని అడిగాడు. అతని పేరు చూడగానే ఇంకేమీ మాట్లాడకుండా కర్రలతో కొట్టడం మొదలుపెట్టారు. దాడికి పాల్పడింది విశాల్ గౌడ్ అని ఎలా గుర్తించారని అయాజ్ ప్రశ్నించగా, ఆ ప్రాంతంలో తన పోస్టర్లు ఉన్నాయని అయాజ్ చెప్పాడు. "అతన్ని ఎవరు కొట్టారని మేము ఫయాజ్‌ని అడిగినప్పుడు, అతను గౌడ్ ఫోటోతో ఉన్న పోస్టర్‌ను చూపాడు." ఘటన అనంతరం జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న పోలీసులు విశాల్ గౌడ్‌పై ఫిర్యాదును స్వీకరించేందుకు నిరాకరించారని అయాజ్ ఆరోపించారు. ఇంతకుముందు కూడా విశాల్ గౌడ్ ఇలాంటి అనేక కేసుల్లో ప్రమేయం ఉన్నాడని తెలిపారు.

Next Story