వినియోగదారులకు భారీ షాక్ ఇవ్వనున్న ఎయిర్ టెల్
Airtel Head Says Rates To Go Up. భారతీ ఎయిర్‌టెల్ ఈ ఏడాది అన్ని ప్లాన్‌ల ధరలను పెంచబోతోంది.
By Medi Samrat Published on 28 Feb 2023 8:00 PM IST
భారతీ ఎయిర్‌టెల్ ఈ ఏడాది అన్ని ప్లాన్‌ల ధరలను పెంచబోతోంది. మొబైల్ ఫోన్ కాల్, డేటా రేట్లను పెంచాలని భావిస్తున్నట్లు టెలికాం సంస్థ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ తెలిపారు. టెలికామ్ బిజినెస్ లో వచ్చే లాభాలు చాలా తక్కువని, ఈ ఏడాది టారిఫ్ లు పెంచుతామని ఆయన తెలిపారు. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ)లో ఆయన మాట్లాడుతూ టెలికాం పరిశ్రమలో మూలధనంపై రాబడి చాలా తక్కువగా ఉందని.. దాన్ని మార్చాల్సిన అవసరం ఉందన్నారు. భారతీయ టారిఫ్ పరిస్థితిలో రావాల్సిన చిన్న మార్పుల గురించే మాట్లాడుతున్నామని.. ఈ సంవత్సరం పెంపు ఉంటుందని నేను భావిస్తున్నా అని వివరించారు. ప్రజలు ఇతర విషయాలపై ఖర్చు చేస్తున్న దానితో పోలిస్తే ఈ పెంపు తక్కువగా ఉంటుందని సునీల్ మిట్టల్ అభిప్రాయ పడ్డారు.
జులైలోపు టారిఫ్ రేట్ల పెంపు ఉండవచ్చని.. ఈ ఏడాదిలో యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ పెంచుకోవాలని ఎయిర్ టెల్ కంపెనీ టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రజలు మిగతా వాటిపై చేసే ఖర్చులతో పోలిస్తే టారిఫ్ రేట్లు తక్కువగానే పెంచుతామని, దీనివల్ల ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురవ్వవని మిట్టల్ అన్నారు. ఎయిర్ టెల్ కంపెనీ ఇప్పటికే దాని కనీస రీఛార్జ్ ప్లాన్ ₹ 99ని నిలిపివేసింది. Airtel స్వల్పకాలిక ARPU లక్ష్యం ₹ 200 అయితే, స్థిరమైన కార్యకలాపాల కోసం ధరల పెంపు ద్వారా మధ్యస్థం నుండి దీర్ఘకాలిక ARPU లక్ష్యం ₹ 300పై దృష్టి పెట్టనుంది.