టెస్ట్ డ్రైవ్‌కు రేసింగ్ బైక్‌ను తీసుకెళ్లాడు.. మళ్లీ రాలేదు..!
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలోని ఓ షోరూమ్ నుంచి టెస్ట్ డ్రైవ్‌కు వెళ్లిన మోటార్‌సైకిల్‌తో పరారైన వ్యక్తిని అరెస్ట్ చేశారు
By Medi Samrat Published on 8 Nov 2024 7:36 PM ISTఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలోని ఓ షోరూమ్ నుంచి టెస్ట్ డ్రైవ్‌కు వెళ్లిన మోటార్‌సైకిల్‌తో పరారైన వ్యక్తిని అరెస్ట్ చేశారు. సాహిల్ అనే నిందితుడు షోరూమ్ సిబ్బందిని మోసం చేసి బైక్‌తో ఉడాయించాడు. టీ విక్రేతను తనతో పాటూ తీసుకుని వెళ్లి తన తండ్రి అని షోరూమ్ సిబ్బందికి తెలిపాడు. కానీ వెళ్లిన సాహిల్ తిరిగి రాకపోవడంతో మోసపోయామని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
షోరూమ్ యజమాని తెలిపిన వివరాల ప్రకారం.. లక్షకు పైగా విలువ ఉన్న సెకండ్ హ్యాండ్ రేసింగ్ మోటార్ సైకిల్ కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో సాహిల్ నవంబర్ 3న దుకాణానికి వచ్చాడు. ధరపై చర్చలు జరిపిన తర్వాత, సాహిల్ తన తండ్రితో తిరిగి వస్తానని హామీ ఇచ్చాడు. ఒక వృద్ధుడిని తీసుకొచ్చిన సాహిల్ తన తండ్రి అంటూ షోరూమ్ సిబ్బందికి తెలిపాడు. తండ్రి షో రూమ్ లోనే ఉన్నాడు కదా అని సాహిల్‌ను టెస్ట్ రైడ్ కోసం మోటారుసైకిల్‌ను తీసుకెళ్లడానికి సిబ్బంది అనుమతించారు. సాహిల్‌కి తాళాలు ఇవ్వగానే, షోరూమ్‌లో ఉన్న వృద్ధుడిని వదిలిపెట్టి బైక్ పై వెళ్ళిపోయాడు.
గంటలు గడుస్తున్నా సాహిల్ తిరిగి రాకపోవడంతో షోరూమ్ యజమానికి అనుమానం వచ్చి ఆ వృద్ధుడిని ఆరాతీశాడు. సాహిల్ తరచుగా టీ తాగడానికి తన దుకాణానికి వచ్చేవాడని, "ముఖ్యమైన పని" కోసం తనతో పాటు రమ్మని అడిగారని, దానికి అంగీకరించానని అతను వివరించాడు. మోసపోయానని గ్రహించిన షోరూం యజమాని లోహమండి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా నవంబర్ 5న ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. నవంబర్ 6 న సాహిల్‌ను అరెస్టు చేశారు. అతని నుండి దొంగిలించిన మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.