Yanam:ప్రియుడిని మర్చిపోలేక.. ప్రియురాలు ఆత్మహత్య
ప్రేమించిన యువకుడు వ్యసనాలకు బానిసయ్యాడు. క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడి తనువు చాలించాడు. అది తట్టుకోలేక ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడింది.
By అంజి Published on 22 Aug 2023 9:51 AM ISTYanam:ప్రియుడిని మర్చిపోలేక.. ప్రియురాలు ఆత్మహత్య
ప్రేమించిన యువకుడు వ్యసనాలకు బానిసయ్యాడు. క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడి తనువు చాలించాడు. దీంతో అతను లేని లోకంలో తానూ మనలేక ఆత్మహత్యకు పాల్పడిందో యువతి. రోజుల వ్యవధిలోనే రెండు ప్రాణాలు కోల్పోయిన ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ విషాద ఘటన తూర్పు గోదావరి జిల్లా యానంలో చోటుచేసుకుంది. ఎస్సై నూకరాజు తెలిపిన వివరాల ప్రకారం.. యానాం సమీపంలోని యూకేవీనగర్‌కి చెందిన మీసాల మౌనిక (22) అనే యువతి తల్లిదండ్రులు పదేళ్ల క్రితం చనిపోయారు. మౌనికకు అక్క, చెల్లి ఉండగా ఇద్దరికీ వివాహాలు జరిగి వారి వారి అత్తారిళ్లలో ఉంటున్నారు. ఇక మౌనిక ప్రస్తుతం మేనమామ త్రిమూర్తులు వద్ద ఉంటూ తాళ్లరేవు మండలం చొల్లంగిలోని రాయల్ కాలేజీలో నర్సింగ్ మూడో సంవత్సరం చదువుతోంది.
రెండేళ్ల క్రితం కురసాంపేటకు చెందిన నిమ్మకాయల చిన్నాతో మౌనికకు పరిచయం కుదిరింది. వారి స్నేహం కాస్తా ప్రేమకు దారితీసింది. అయితే చిన్నాకు చెడు వ్యసనాలు ఎక్కువ. ఈ క్రమంలోనే గంజాయికి బానిసైన చిన్నా రెండు నెలల క్రితం తన సోదరుడిని రూ.500 అడిగాడు. అయితే చిన్నా సోదరుడు డబ్బులివ్వలేదు. దీంతో కోపోధ్రిక్తుడైన చిన్నా ఒంటికి నిప్పంటించుకున్నాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మంటలు ఆర్పి వేసి బాధితుడిని కాకినాడలోని ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన చిన్నా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ప్రేమించిన వాడు మరణించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మౌనిక కాలేజీకి వెళ్లడం మానేసింది. చిన్నా జ్ఞాపకాలతో మానసికంగా కుంగిపోవడమే కాకుండా అతనికి సంబంధించిన దుస్తులు, వస్తువులను గదిలో పెట్టుకుని, ఫొటోలు గోడలకు అతికించి కన్నీరుమున్నీరుగా విలపించింది. ప్రేమించినవాడు ఇకలేడనే విషయాన్ని జీర్ణించుకోలేక పోయింది. ఈ నేపథ్యంలో సోమవారం ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మేనమామ త్రిమూర్తులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు నెలకొన్నాయి.