నెల్లూరులో జిల్లాలో దారుణం.. మైనర్ బాలికపై అత్యాచార యత్నం.. మాటవినలేదని.. నోట్లో యాసిడ్ పోసి.. గొంతుకోసి
Acid Attack on minor girl in Nellore.మైనర్ బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి యత్నించాడు.
By తోట వంశీ కుమార్ Published on 6 Sept 2022 9:09 AM ISTమైనర్ బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి యత్నించాడు. బాలిక తీవ్రంగా ప్రతిఘటించడంతో నోట్లో, ముఖంపై యాసిడ్ పోశాడు. అనంతరం గొంతు కోసి పరారు అయ్యాడు. ఈ దారుణ ఘటన నెల్లూరు జిల్లాలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వెంకటాచలం మండలం చెముడుగుంట నక్కలకాలనీలో నివాసం ఉంటున్న 14 ఏళ్ల బాలిక నెల్లూరు నగరానికి సమీపంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. సోమవారం సాయంత్రం కుటుంబ సభ్యులు ఓ పని నిమిత్తం బయటకు వెళ్లారు. ఇంట్లో బాలిక ఒక్కత్తే ఉంది. ఈ విషయాన్ని గమనించిన నాగరాజు అనే వ్యక్తి బాలిక ఇంట్లోకి చొరబడ్డాడు.
బాలికపై అత్యాచారానికి యత్నించాడు. బాలిక ప్రతిఘటించి పక్కనే ఉన్న వాష్‌రూమ్‌లోకి పరుగెత్తింది. తలుపులు వేసుకునే ప్రయత్నం చేయగా.. నాగరాజు అడ్డుకుని బాత్రూమ్‌లోనే బాలికపై అత్యాచారానికి యత్నించాడు. తీవ్రంగా బాలిక ప్రతిఘటించింది. దీంతో ఆగ్రహించిన నాగరాజు.. బాలిక ముఖం,నోట్లో యాసిడ్ పోశాడు. బాలిక బాధ తట్టుకోలేక కేకలు వేయడంతో నిందితుడు కత్తితో గొంతు కోసి అక్కడ నుంచి పరారు అయ్యాడు.
బాలిక అరుపులతో ఇరుగుపొరుగు వారు వెంటనే అక్కడకు చేరుకున్నారు. తీవ్రగాయాలతో ఉన్న బాలికను ఆస్పత్రికి తరలించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు నాగరాజు బాలికకు మేనమామ వరుస అవుతాడని అంటున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
కొన్నాళ్లుగా వేధింపులు
గత కొన్నాళ్లుగా బాలికను నాగరాజు వేదిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అతడి వేధింపులు అధికం కావడంతో అతడితో బాలిక మాట్లాడం లేదని చెప్పారు. అతడు మాత్రం అదును చూసి.. బాలిక ఇంట్లో ఎవరు లేని సమయంలో బాలికపై అఘాయిత్యానికి యత్నించాడు. మాట వినకపోయే సరికి హతమార్చాలని చూశాడు.
మంత్రి పరామర్శ..
బాధితురాలిని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి, ఎస్పీ విజయరావు సోమవారం రాత్రి పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.