ఎమ్మెల్యే హత్య కేసులో ప్రధాన సాక్షిని చంపిన నిందితుడి ఎన్‌కౌంటర్‌

Accused in Umesh Pal murder case killed in encounter. ఉమేష్ పాల్ హత్యకేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు.

By M.S.R  Published on  27 Feb 2023 12:30 PM GMT
ఎమ్మెల్యే హత్య కేసులో ప్రధాన సాక్షిని చంపిన నిందితుడి ఎన్‌కౌంటర్‌

ఉమేష్ పాల్ హత్యకేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. ప్రయాగ్‌రాజ్‌లోని నెహ్రూ పార్క్‌ ప్రాంతంలో నిందితుడిని ఉత్తరప్రదేశ్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, జిల్లా పోలీసులు కాల్చి చంపారు. నిందితుడిని అర్బాజ్‌గా గుర్తించారు. బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసులో ప్రధాన సాక్షి ఉమేష్ పాల్ ను శుక్రవారం సాయంత్రం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని ఆయన నివాసం డాగర కాల్చి చంపారు.

ప్రయాగ్‌రాజ్‌లో హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ నుంచి దిగుతుండగా ఉమేష్ పాల్‌ను గుర్తు తెలియని వ్యక్తి కాల్చి చంపాడు. పాల్‌ను స్వరూప రాణి నెహ్రూ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. పాల్ శవపరీక్ష నివేదికలో అతనిపై ఏడుసార్లు కాల్పులు జరిపారని తేలింది. హత్య అనంతరం ఉమేష్ పాల్ భార్య జయపాల్ ప్రయాగ్‌రాజ్ పోలీసులను ఆశ్రయించి ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ సోదరుడు, భార్య సహిస్తా పర్వీన్, ఆయన కుమారులు అహ్జాన్, అబాన్‌తో పాటు పలువురిపై ఐపీసీ, పేలుడు పదార్థాల చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఉమేష్ పాల్ హత్య కేసులో బీజేపీ నేత రహీల్ హసన్ సోదరుడు గులామ్ పేరును కూడా చేర్చారు, దీంతో బీజేపీ అధిష్టానం అతడిని పార్టీ నుండి తొలగించింది.

ఉమేష్ పాల్ ను హత్య చేసిన వారి కోసం ఉత్తరప్రదేశ్ పోలీసులు 10 బృందాలను ఏర్పాటు చేశారు. పలు చెక్ పోస్టులు, బస్టాండ్‌లు, విమానాశ్రయాలతో సహా అన్ని ప్రాంతాలను విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. ఉమేష్ పాల్ హత్యపై అతిక్ బంధువులతో సహా 40 మందిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అహ్మదాబాద్‌లోని సబర్మతి జైలులో ఉన్న అతిక్ ఖాన్ ఉమేష్ పాల్ హత్యకు కుట్ర పన్నాడని ఉత్తరప్రదేశ్ పోలీసులు భావిస్తున్నారు. ఉమేష్ పాల్ హత్య కేసులో సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ అతిక్ అహ్మద్ భార్య షైస్తా పర్వీన్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాశారు.


Next Story