హైదరాబాద్‌లో యువతిపై దారుణం..వేలి గోర్లు పీకి, ప్రైవేట్ భాగాలపై దాడి
హైదరాబాద్ నగరంలోని సోమాజిగూడలో ఓ యువతి పై ఐటీ ఉద్యోగి చేసిన దారుణం కలకలం రేపింది
By - Knakam Karthik |
హైదరాబాద్‌లో యువతిపై దారుణం..వేలి గోర్లు పీకి, ప్రైవేట్ భాగాలపై దాడి
హైదరాబాద్ నగరంలోని సోమాజిగూడలో ఓ యువతి పై ఐటీ ఉద్యోగి చేసిన దారుణం కలకలం రేపింది. ప్రేమ పేరుతో మోసం చేసి, వివాహం చేస్తానని నమ్మించి, చివరకు దారుణంగా దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..సోమాజిగూడకు చెందిన ఓ యువతి ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువును మధ్యలోనే మానేసి, ప్రస్తుతం మణికొండలోని ఓ సంస్థలో పనిచేస్తోంది. అదే సంస్థలో పనిచేస్తున్న మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేటకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అంకి భాను ప్రకాశ్ (23) బీఎన్ రెడ్డి నగరంలో నివాసముంటున్నాడు. మణికొండలో పని సందర్భంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడి, ఆ పరిచయం ప్రేమగా మారింది.
వివాహం చేస్తానని హామీ ఇచ్చిన ప్రకాశ్, తరచూ యువతిని కలుస్తూ వచ్చాడు. కానీ ఇటీవల ఆమె ప్రవర్తనలో మార్పు గమనించి, అనుమానం పెంచుకున్న ప్రకాశ్ ఆమెపై వేదింపులు ప్రారంభించాడు. అక్టోబర్ 26న రాత్రి, ప్రకాశ్ సోమాజిగూడలోని యువతి ప్లాట్‌కు వెళ్లి గొడవపడ్డాడు. ఆ సమయంలో ఆమెను గదిలో బంధించి లైంగిక దాడికి ప్రయత్నించాడు. యువతి ప్రతిఘటించడంతో ఆగ్రహించిన ప్రకాశ్, కత్తెరతో ఆమె మధ్య వేలి గోర్లు పీకేశాడు, ప్రైవేట్ భాగాలపై దాడి చేశాడు, గొంతు పిసికాడు. అంతేకాదు, "పోలీసులకు చెబితే యాసిడ్ దాడి చేస్తా" అని బెదిరించాడు.
తర్వాత గాయాలతో ఉన్న యువతి ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడు ప్రకాశ్‌ను అదుపులోకి తీసుకొని రిమాండుకు తరలించారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇలాంటి ఘోరాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేస్తున్నారు.