వికారాబాద్‌లో దారుణం..తల్లిదండ్రులకు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి హత్య..కారణమిదే!
కులాంతర ప్రేమ వివాహానికి తల్లిదండ్రులు అడ్డుగా ఉన్నారనే కోపంతో ఓ కూతురు అమానుషానికి పాల్పడింది.
By - Knakam Karthik |
వికారాబాద్‌లో దారుణం..తల్లిదండ్రులకు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి హత్య..కారణమిదే!
వికారాబాద్: కులాంతర ప్రేమ వివాహానికి తల్లిదండ్రులు అడ్డుగా ఉన్నారనే కోపంతో ఓ కూతురు అమానుషానికి పాల్పడింది. మత్తు ఇంజెక్షన్లను ఉపయోగించి తల్లిదండ్రులను హత్య చేసిన ఈ దారుణ ఘటన వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ మండలంలో సంచలనం సృష్టించింది. పోలీసుల విచారణలో నిందితురాలు నేరాన్ని అంగీకరించినట్లు అధికారులు వెల్లడించారు. నిందితురాలు మృతుల చిన్న కూతురు. ఆమె బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ప్రస్తుతం సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా విధులు నిర్వహిస్తోంది. గత ఏడాది నుంచి ఆమెకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ యువకుడితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయగా, అతడు వేరే కులానికి చెందినవాడని పేర్కొంటూ ఆమె ప్రేమ వివాహానికి తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ అంశంపై కుటుంబంలో పలుమార్లు గొడవలు జరిగినప్పటికీ తల్లిదండ్రులు తమ నిర్ణయాన్ని మార్చుకోలేదు. దీంతో వారిని హత్య చేసి ప్రేమ వివాహం చేసుకోవాలని నిందితురాలు ముందే పథకం రచించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
పథకం ప్రకారం, నిందితురాలు తాను పనిచేస్తున్న ఆసుపత్రిలో ఎమర్జెన్సీ అవసరాల కోసం ఉంచిన ‘Atracurium (Artacil) 2.5 ml’ మత్తు ఇంజెక్షన్లను నాలుగు బాటిళ్లు దొంగతనంగా సేకరించింది. అనంతరం 24-01-2026న వీక్లీ ఆఫ్ తీసుకొని సంగారెడ్డి నుంచి మోమిన్‌పేట్‌కు వచ్చి, అక్కడ ఓ మెడికల్ షాప్‌లో మూడు సిరంజీలు కొనుగోలు చేసి స్వగ్రామమైన యాచారం గ్రామంలోని ఇంటికి చేరుకుంది. రాత్రి భోజనం అనంతరం మరోసారి ప్రేమ వివాహం విషయమై తల్లిదండ్రులతో వాగ్వాదం జరగగా, వారు స్పష్టంగా నిరాకరించడంతో ఇక వారిని బ్రతకనివ్వకూడదని నిర్ణయించుకుంది. ముందుగా రాత్రి 10 గంటల సమయంలో తల్లికి ఒళ్లునొప్పుల మందు అని చెప్పి ‘Atracurium (Artacil) 5 ml’ ఇంజెక్షన్‌ను అధిక మోతాదులో ఇవ్వగా ఆమె కుప్పకూలిపోయింది. అనంతరం ఆమెను నిద్రపోతున్నట్లుగా పడుకోబెట్టింది.
కొద్దిసేపటి తర్వాత బయట నుంచి చలిమంట కాచుకుని వచ్చిన తండ్రికి కూడా అదే విధంగా ఒళ్లునొప్పుల మందు అంటూ ‘Atracurium (Artacil) 5 ml’ ఇంజెక్షన్‌ను IV ద్వారా అధిక మోతాదులో ఇచ్చింది. దీంతో అతడు కూడా అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లిదండ్రుల మరణాలను సహజ మరణాలుగా చిత్రీకరించేందుకు నిందితురాలు తన అన్నకు ఫోన్ చేసి భయపడుతున్నట్లు నటిస్తూ ఇంటికి రప్పించింది. తండ్రి తనతో మాట్లాడుతుండగా అకస్మాత్తుగా పడిపోయాడని, పల్స్ చెక్ చేయగా మృతి చెందినట్లు తెలిపినట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం తల్లి షాక్‌కు గురై స్పృహ తప్పిందని, CPR చేసినప్పటికీ మృతి చెందినట్లు చెప్పి ఆధారాలను దాచేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.
అయితే నేర స్థలంలో ఉపయోగించిన రెండు సిరంజీలు, వాటిపై రక్తపు చుక్కలు ఉండటంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేసి క్షుణ్ణంగా విచారణ చేపట్టారు. మృతుల కుటుంబ సభ్యులు కూడా చిన్న కూతురిపై అనుమానం వ్యక్తం చేయడంతో ఆమెను ప్రశ్నించగా, చివరికి నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితురాలి విచారణలో ఆమె ఇంటి నుంచి ఖాళీగా ఉన్న నాలుగు ఇంజెక్షన్ బాటిళ్లు, రెండు వాడిన సిరంజీలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.