రంగారెడ్డి జిల్లా రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన విద్యార్థిని కుటుంబంలో విషాదఛాయలను నింపింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మీర్పేట్ పరిధిలోని అల్మాస్‌గూడ ఎస్ఎస్ఆర్ నగర్ కాలనీలో గత కొన్ని సంవత్సరాలుగా నివాసం ఉంటున్న అంబాదళ అశోక్, రూప దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరి కుమార్తె విహారిక (20) బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. స్థానికంగా నివసించే కిషోర్ అనే యువకుడితో విహారిక కొన్ని నెలల నుంచి ప్రేమ సంబంధం కొనసాగిస్తోంది.
అయితే ఇటీవల పెళ్లి విషయమై విహారిక కుటుంబ సభ్యులు ప్రశ్నించడంతో, కిషోర్ పెళ్లికి స్పష్టంగా నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన విహారిక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ నెల 17వ తేదీన విహారిక ఇంటి నుంచి వెళ్లిపోగా, ఆందోళన చెందిన తల్లిదండ్రులు మీర్పేట్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అనంతరం 18వ తేదీన కిషోర్, విహారికను తీసుకువచ్చి ఆమె ఇంటి వద్ద వదిలినట్లు సమాచారం.
పెళ్లి చేసుకోవాలని విహారిక, ఆమె తల్లిదండ్రులు కోరినప్పటికీ కిషోర్ నిరాకరించడంతో విహారిక తీవ్రంగా కలత చెందినట్లు విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై మీర్పేట్ పోలీసులు BNS సెక్షన్ 108 కింద కేసు నమోదు చేసి, నిందితుడు కిషోర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతనిని విచారిస్తున్న పోలీసులు, విచారణ అనంతరం రిమాండ్‌కు తరలించనున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.