ఓ యువకుడు తన స్నేహితులు, తోటి ఉద్యోగులతో కలిసి పార్టీలో ఎంజాయ్ చేశాడు... ఏం జరిగిందో తెలియదు కానీ తెల్లారేసరికి ఆ యువకుడు మృతి చెంది కనిపించాడు. ఈ ఘటన ఆ యువకుడి కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం జిల్లా ప్రసాద్ నగర్ కి చెందిన హర్షవర్ధన్ అనే యువకుడు ఉద్యోగరీత్యా హైదరాబాదు నగరానికి వచ్చి గచ్చిబౌలి ప్రాంతంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటూ.. సికింద్రాబాద్‌లోని ఓ కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తున్నాడు. హర్ష వర్ధన్ నిన్న రాత్రి సమయంలో స్నేహితులు, తోటి ఉద్యోగులతో కలిసి కొండాపూర్ లో ఉన్న క్వాక్ పబ్బులో పార్టీ చేసుకున్నాడు.
పార్టీ అనంతరం హర్షవర్ధన్, అతని స్నేహితులు కలిసి పబ్బు నుండి బయలుదేరి హర్షవర్ధన్ నివాసం ఉంటున్న గచ్చిబౌలిలోని అపార్ట్మెంట్ కి వచ్చారు. అపార్ట్మెంట్లో మరోసారి వీరందరూ కలిసి మద్యం సేవించారు. అయితే ఇవాళ తెల్లవారుజామున హర్షవర్ధన్ కి ఒక్క సారిగా వాంతులు అవ్వడం మొదలయ్యాయి. అది గమనించిన స్నేహితులు భయపడిపోయి వెంటనే హర్షవర్ధన్‌ను ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. హర్షవర్ధన్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న వెంటనే రాయదుర్గం పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.