రంగారెడ్డి జిల్లాలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుద్వేల్‌లో నివాసం ఉంటున్న శ్రీనివాస్ అనే డైలీ లేబర్‌ను గుత్తేదారు సాయి అనే యువకుడు చంపేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీనివాస్, సాయి.. ఇద్దరి మధ్య మంచి ఉంది. ఈ క్రమంలోనే సాయి తన అవసరాల కోసం శ్రీనివాస్ వద్ద నుండి 500 రూపాయలు తీసుకున్నాడు. ఆ తర్వాత సాయి ఆ డబ్బులు తిరిగి శ్రీనివాస్ కు ఇవ్వ లేదు. అయితే నిన్న అర్ధరాత్రి సమయంలో శ్రీనివాస్, సాయి ఇద్దరు కలిసి మద్యం సేవించారు.
ఆ సమయంలో ఇద్దరి మధ్య గొడవ చెలరేగింది. శ్రీనివాస్ తనకు ఇవ్వవలసిన 500 రూపాయల కొరకు సాయితో తగాదాకు దిగాడు. మద్యం మత్తులో ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున గొడవ చెలరేగడంతో ఒకరినొకరు కొట్టుకున్నారు. ఆవేశానికి లోనైనా సాయి పక్కనే ఉన్న డ్రైనేజ్ మూత తీసుకొని శ్రీనివాస్ తలపై గట్టిగా కొట్టాడు. శ్రీనివాస్ తలకు తీవ్రగాయమై అధిక రక్తస్రావం కావడంతో ఒక్కసారిగా అక్కడే కుప్పకూలి పడిపోయాడు. అది గమనించిన స్థానికులు వెంటనే అతన్ని హాస్పటల్ కి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.