తన ప్రేమను ఒప్పుకోలేదని యువతిపై ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ అమానుష ఘటన జార్ఖండ్‌లోని దుమ్కాలో చోటు చేసుకుంది. 90 శాతం కాలిన గాయాలతో బాధితురాలు రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆగస్టు 23న ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. దుమ్కా పీఎస్ పరిధిలో నివసిస్తున్న షారుక్ హుసేన్ అనే యువకుడు అంకిత (19) అనే యువతి ప్రేమించాలంటూ వెంబడిస్తూ వేధింపులకు గురి చేశస్త్రాడు. అందుకు అంకిత అంగీకరించలేదు.
దీంతో ఆగస్టు 23న తెల్లవారుజామున ఆమె నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి దాటాక అంకిత కన్నుమూసింది. యువతి మరణించిందన్న విషయం బయటకు తెలియడంతో దుమ్కాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ, భజరంగ్ దళ్ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. దుమ్కాలోని వ్యాపారులు స్వచ్ఛందంగా తమ తమ దుకాణాలను మూసేశారు. అధికారులు ముందుజాగ్రత్త చర్యగా దుమ్కాలో 144వ సెక్షన్ విధించారు.
''షారుక్ హుసేన్ అనే యువకుడు కొన్ని రోజుల క్రితం ఫోన్ చేశాడు. ప్రేమించాలని.. ప్రేమించకపోతే చంపేస్తానని బెదిరింపులకు గురి చేశాడు. మంగళవారం ఉదయం మంచంపై ఉన్న నాకు కాలిన వాసన వచ్చింది. అనంతరం కళ్లు తెరిచి చూడగా అతడు పారిపోవడం కనిపించింది. ఇంతలో మంటలు అంటుకున్నాయి. ఆ బాధతో విలవిల్లాడుతూనే.. మా నాన్న గదిలోకి వెళ్లాను. నా తల్లిదండ్రులు మంటలను ఆర్పి ఆసుపత్రిలో చేర్పించారు'' అని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన మరణ వాంగ్మూలంలో పేర్కొంది.