హైదరాబాద్: హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ప్రియురాలి మరణాన్ని తట్టుకోలేక యువకుడు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. యాచారం మండలంలో నిన్న 17 ఏళ్ల బాలిక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై ప్రియుడు సిద్ధగోని మహేష్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పూజ ఆత్మహత్యకు కారణమంటూ అతనిపై ఆరోపణలు చేస్తూ బంధువులు పోలీసులను ఆశ్రయించారు.
అయితే మహేశ్, ఆ బాలిక నాలుగు నెలలుగా ప్రేమించుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. పెళ్లి చేసుకోవాలనుకున్నా పెద్దలు ఒప్పుకోకపోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించారు. దీంతో మనస్తాపానికి గురై ఇద్దరు కూడా పురుగుల మందు ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే అదృష్టవశాత్తు అప్పుడు ప్రాణాలతో బయటపడ్డారు. అనంతరం మళ్లీ సోమవారం బాలికకు ఫోన్ చేసిన ప్రియుడు పెళ్లి చేసుకోవాలని బెదిరించాడు. దీంతో ఒత్తిడికి లోనైన బాలిక మంగళవారం ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. బాలిక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిన ప్రియుడు బుధవారం పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరి మరణాలతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.