ట్రాఫిక్ కానిస్టేబుల్ వేదింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హన్మకొండ జిల్లా శాయంపేట మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. తహరాపూర్ గ్రామానికి చెందిన సునీత(30) ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఐసీడీఎస్ గ్రేడ్– 1 సూపర్ వైజర్‌గా పని చేస్తోంది. కొద్ది నెలల క్రితం ఆమెకు హనుమకొండ జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సర్వేశ్‌యాదవ్‌తో పరిచయమైంది.
అయితే.. అప్పటికే సర్వేశ్ యాదవ్‌కు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ విషయాన్ని దాచి సంగీతకు మాయమాటలు చెప్పాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఫోన్ చేసి తరచూ వేదించేవాడు. కాగా.. అతడికి వివాహామైన విషయం సంగీత బంధువులు తెలుసుకుని పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు. ప్రేమ పేరుతో వేదించొద్దని తెలిపారు. కాగా.. సోమవారం పని ముగించుకుని ఇంటికి వచ్చిన సంగీతను రాత్రి సర్వేష్ యాదవ్ ఫోన్‌లో వేదింపులకు గురిచేశాడు. దీంతో మనస్థాపానికి గురైన సంగీత పురుగుల మందు తాగింది. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.