నారాయణ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు మరువకముందే తాజాగా ఆ సంస్థ రెసిడెన్షియల్ స్కూల్ స్టూడెంట్ సూసైడ్ చేసుకోవడం కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లోని హయత్‌నగర్ బ్రాంచ్‌లో ఏడో తరగతి చదువుతున్న లోహిత్ ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు. అయితే తమ కుమారుడి మృతిపై యాజమాన్యం పొంతనలేని సమాధానాలు చెబుతోందంటూ బంధువులు స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. లోహిత్ రెడ్డి.. అనే విద్యార్థి హయత్ నగర్ నేతాజీ నగర్ బ్రాంచ్ అయినా నారాయణ రెసిడెన్షియల్ స్కూల్‌లో 7వ తరగతి చదువుతూ, హాస్టల్‌లో ఉంటున్నాడు. హాస్టల్ గదిలో ఎవరూ లేని సమయంలో లోహిత్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అది గమనించిన తోటి విద్యార్థులు వెంటనే హాస్టల్ యాజమాన్యంకు సమాచారం అందించారు. దీంతో హాస్టల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. విద్యార్థి మృతిపై హాస్టల్ యాజమాన్యం పొంతన లేని సమాధానం చెబుతోందని బంధువులు అంటున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే బాలుడి తల్లిదండ్రులు ఘటన స్థలానికి చేరుకొని గుండెలు పగిలేలా విలపిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా హాస్టల్ ఎదుట భారీగా పోలీసులు మోహరించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి.. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.