డబ్బులు ఇవ్వలేదని.. నానమ్మ గొంతుకోసి చంపిన మనువడు

A minor who killed his grandmother for not giving him money. దేశ రాజధాని ఢిల్లీలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. షాలిమార్‌బాగ్‌లో డబ్బులు ఇవ్వలేదని 84 ఏళ్ల వృద్ధురాలిని..

By అంజి  Published on  11 July 2022 2:39 PM IST
డబ్బులు ఇవ్వలేదని.. నానమ్మ గొంతుకోసి చంపిన మనువడు

దేశ రాజధాని ఢిల్లీలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. షాలిమార్‌బాగ్‌లో డబ్బులు ఇవ్వలేదని 84 ఏళ్ల వృద్ధురాలిని.. ఆమె మైనర్‌ మనవడు చంపాడు. సర్జికల్ బ్లేడ్‌తో నానమ్మ గొంతు కోసి మైనర్ హత్య చేశాడు. ఆ తర్వాత తన నలుగురు స్నేహితులను పిలిచి గదిలో పడి ఉన్న మృతదేహాన్ని చూపించాడు. హత్య కేసులో యువకుడు, అతడి స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వృద్ధురాలు షాలిమార్‌బాగ్‌లో ఒంటరిగా ఉంటోంది. ఇటీవల ఆమెకు చెందిన ఓ ఇంటిని విక్రయించింది. వృద్ధురాలు హత్యకు గురైందన్న విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. హత్యకు ముందు రోజు రాత్రి 9:30 గంటల ప్రాంతంలో తెల్లటి టవల్‌తో ముఖం కప్పుకుని ఓ యువకుడు ఇంట్లోకి రావడాన్ని పోలీసులు గుర్తించారు. రాత్రి 11:20 గంటలకు బయటకు వచ్చిన అతను మళ్లీ రాత్రి 12:20 గంటలకు ఇంట్లోకి ప్రవేశించాడు. ఫుటేజీని పోలీసులు కుటుంబ సభ్యులకు చూపించగా అనుమానితుడిని గుర్తించారు.

పోలీసులు మైనర్‌ను పాఠశాల నుండి అదుపులోకి తీసుకొని విచారించగా, అతను కొంతమంది యువకులకు డబ్బు బాకీ ఉన్నాడని, డబ్బు కోసమే తన అమ్మమ్మను హత్య చేసానని వెల్లడించాడని పోలీసులు తెలిపారు. సాహిల్ సైనీ (22), మయాంక్ సైనీ (21), సన్నీ బాఘెల్ (19), సచిన్ సైనీ (28)లు హత్యకు ప్లాన్ చేయడంలో సహాయం చేశారని వెల్లడించాడు. హత్య జరిగిన రోజు రాత్రి ఇంట్లోకి ప్రవేశించి నానమ్మను మనువడు డబ్బులు అడిగాడు. ఆమె నిరాకరించడంతో మైనర్ బామ్మను తోసి ఆమె గొంతు కోశాడు. డబ్బు దోచుకుని అప్పులు తీర్చాడు. నిందితుడి వద్ద నుంచి సర్జికల్ బ్లేడ్, మైనర్ రక్తంతో తడిసిన బట్టలు, రూ.50 వేల నగదు, స్విఫ్ట్ డిజైర్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Next Story