Hyderabad: మైనర్ బాలికను గంజాయికి బానిసను చేసి.. మత్తులో గ్యాంగ్ రేప్
తల్లి కూలి పనులకు వెళ్తుంది.. ఇంట్లో కూతురు ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలోనే ఫోన్‌లో ఓ యువకుడితో బాలికకు పరిచయం ఏర్పడింది.
By అంజి Published on 25 Jun 2024 9:54 AM ISTHyderabad: మైనర్ బాలికను గంజాయికి బానిసను చేసి.. మత్తులో గ్యాంగ్ రేప్
హైదరాబాద్: తల్లి కూలి పనులకు వెళ్తుంది.. ఇంట్లో కూతురు ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలోనే ఫోన్‌లో ఓ యువకుడితో బాలికకు పరిచయం ఏర్పడింది. ఆ యువకుడు కాస్త తన స్నేహితులతో కలిసి మైనర్ బాలికకు గంజాయి అలవాటు చేశాడు. స్నేహితులందరూ కలిసి.. మత్తులో ఉన్న బాలికపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక గర్భం దాల్చడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ కు చెందిన ఓ మహిళ 15 ఏళ్ల తన కూతుర్ని తీసుకొని వచ్చి హైదరాబాదు నగరంలోని కాచిగూడ పరిధిలో నివాసం ఉంటూ రోజువారి కూలికి వెళ్తోంది.
అయితే బాలిక ఆరో తరగతి వరకు చదువుకొని ఆ తర్వాత చదువు మానేసి ఇంట్లోనే ఉంటోంది. తల్లి కూలి పనులకు వెళ్లిన తర్వాత బాలిక ఇంటి దగ్గర ఉన్న మరో అమ్మాయితో పరిచయం పెంచుకుంది. రోజు వారి ఇంటికి వెళ్ళేది. ఈ తరుణంలోనే బాలిక దగ్గర ఉన్న సెల్ ఫోన్ తీసుకొని అమ్మాయి తనకు పరిచయం ఉన్న విజయ్ కుమార్ (23) అనే యువకుడికి ఫోన్ చేసి మాట్లాడేది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడడంతో విజయ్ ప్రతిరోజు వచ్చి ఒంటరిగా ఉంటున్న మైనర్ బాలికను తీసుకుని తాను ఉంటున్న నేరేడ్మెట్ కు తీసుకు వెళ్లేవాడు. అక్కడ విజయ్ స్నేహితులైన బాలు(25), కృష్ణ(25), కిరణ్(24), అజయ్(25) లకు బాలికను పరిచయం చేశాడు.
అప్పటికే యువకులందరికీ గంజాయి అలవాటు ఉంది. దీంతో ఆ యువకులందరూ కలిసి మైనర్ బాలికకు గంజాయి అలవాటు చేశారు. బాలిక మత్తులోకి జారుకోగానే ఆమెపై గ్యాంగ్ రేప్ చేశారు. ఇలా పలుమార్లు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఓ రోజు బాలిక అనారోగ్యానికి గురి కావడంతో తల్లి కంగారుపడి ఆస్పత్రికి తీసుకువెళ్లింది. అక్కడ వైద్యులు మైనర్ బాలికను పరీక్ష చేసి చెప్పిన విషయాలు విని తల్లి ఒక్కసారిగా షాక్ గురైంది. దీంతో తల్లి మైనర్ బాలికను నిలదీసి అడుగగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తల్లి వెంటనే తన కూతురిని తీసుకొని వెళ్ళి కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న ఐదుగురు యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.