తెలంగాణలోని కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమను నిరాకరించిందన్న కోపంతో ఓ యువతిని ఓ వ్యక్తి తీవ్రంగా కొట్టాడు. ఆపై యువతి చేత బలవంతంగా పురుగుల మందు తాగించి హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వెంకట్రావ్‌పేటకు చెందిన 19 ఏళ్ల బూడే దీప ఇంటర్ వరకు చదివింది. ప్రస్తుతం చదువు మానేసి కూలీ పనులకు వెళ్తోంది. ఇక అదే గ్రామానికి చెందిన దంద్రే కమలాకర్ ప్రైవేట్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతనికి పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. గత ఆరు నెలల నుండి కమలాకర్.. దీప వెంబడి పడుతున్నాడు. ప్రేమిస్తున్నానని చెబుతూ ఇబ్బందులకు గురి చేశాడు. అయితే అతడి ప్రేమను దీప అంగీకరించలేదు.
దీంతో ఆమె ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని, కుటుంబంలోని అందరినీ చంపుతానని మెసేజ్‌లు పెట్టేవాడు. ఈ క్రమంలోనే గత ఆదివారం నాడు దీప కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులకు వెళ్లాడు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కమలాకర్.. దీప ఇంట్లోకి చొరబడ్డాడు. తనను ప్రేమించకుండా వేరే వారితో మాట్లాడుతున్నావంటూ ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఆ తర్వాత అక్కడున్న పురుగుల మందును బలవంతంగా చేత తాగించి పారిపోయాడు. బాధితురాలు బయటకు వచ్చి గట్టిగా కేకలు వేస్తూ తననను కాపాడాలంటూ చుట్టు పక్కల వారిని కోరింది. దీంతో స్థానికులు ఆమెను వెంటనే సిర్పూర్(టి) ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన ట్రీట్మెంట్ కోసం కరీంగనర్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే దీప చికిత్స పొందుతూ మంగళవారం నాడు ఉదయం మృతి చెందింది.