సౌదీ అరేబియాలోని అల్ ఖోబార్ నగరంలో మంగళవారం ఒక హైదరాబాదీ మహిళ తన ముగ్గురు పిల్లలను చంపి, ఆ తర్వాత ఆత్మహత్యకు ప్రయత్నించింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని టోలిచౌకిలోని మొహమ్మది లైన్స్ (MD లైన్స్)కి చెందిన సయ్యదా హుమేరా అమ్రీన్‌గా గుర్తించబడిన ఆ మహిళ తన కవల కుమారులు సాదేక్ అహ్మద్, అదెల్ అహ్మద్ (7), ఆమె చిన్న కుమారుడు యూసుఫ్ అహ్మద్ (3) లను వారి నివాసంలోని బాత్‌టబ్‌లో ముంచి చంపిందని , పిల్లలను చంపిన తర్వాత, ఆమె కూడా ఆత్మహత్యకు చేసుకోవడానికి ప్రయత్నించిందని కుటుంబ వర్గాలు తెలిపాయి.
అయితే ఆమె భర్త మహమ్మద్ షానవాజ్ సాయంత్రం పని నుండి ఇంటికి తిరిగి వచ్చి పిల్లలు చనిపోయి ఉండటం చూసి షాక్ అయ్యాడు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. ఆ మహిళ, ఆమె పిల్లలు విజిట్ వీసాపై సౌదీ అరేబియాలో ఉన్నారు . ఆమె మానసిక ఆరోగ్య సమస్యలు, ఒంటరితనంతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు చెప్పగా, కుటుంబ వివాదాలు కూడా ఉన్నాయని వర్గాలు సూచించాయి. ఈ సంఘటన వెనుక ఉన్న ఖచ్చితమైన కారణాలు ఇంకా నిర్ధారించబడలేదు. సౌదీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.