కూతురు ఉంటే భారం అనుకుందో.. ఏమో ఆ తల్లి. చక్కగా ఏడో తరగతి చదువుతున్న బాలికను మూడు పదుల వయస్సున వ్యక్తికి ఇచ్చి కట్టబెట్టింది. దీంతో శారీరక వికాసం లేని ఆ బాలిక గర్భవతై శిశువుతో పాటు చనిపోయింది. కృష్ణా జిల్లాలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చల్లపల్లి మండలం పురిటిగడ్డ ప్రాంతానికి చెందిన బాలిక స్థానిక పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. తండ్రి చనిపోయాడు. ఈ క్రమంలోనే బందరు శారదానగర్‌కు చెందిన 30 ఏళ్లు దాటిన వ్యక్తికి బాలికను ఇచ్చి తల్లి బాల్య వివాహం జరిపించింది.
కొన్ని రోజుల తర్వాత శారీరకంగా పూర్తిగా ఎదుగుదలలేని స్థితిలో బాలిక గర్భవతి అయ్యింది. నెలలు నిండుతున్న కొద్దీ ఆమె ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. అనారోగ్యంతో బాలిక పుట్టింటికి చేరింది. పరిస్థితి విషమించడంతో చల్లపల్లి, మచిలీపట్నంలోని ప్రైవేట్ ఆస్పత్రులకు తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు చేతులేత్తేశారు. దీంతో బాలికను విజయవాడలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. 15 రోజుల కిందట గర్భంలోని శిశువు మరణించగా, రెండు రోజుల్లోనే ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినడంతో బాలిక మృతి చెందింది.
బాలిక మృతదేహానికి కుటుంబసభ్యులు గుట్టు చప్పుడు కాకుండా అంత్యక్రియలు నిర్వహించారు. కాగా గర్భవతి అయిన బాలిక ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాల్సిన బాధ్యత ఏఎన్‌ఎంలు మరిచారు. ఎప్పటికప్పుడు తమ పరిధిలోని గర్భిణుల వివరాలను వైద్యారోగ్య శాఖ రికార్డుల్లో నమోదు చేయాల్సిన ఏఎన్‌ఎంలు ఆ పని చేయలేదు. బాలికతో పాటు ఆమె కడుపులోని శిశువు మృతి చెందింది. ఈ విషయాన్ని రికార్డుల్లో చూపకుండా నిర్లక్ష్యం వహించారు.