ఇది నెక్ట్స్ లెవల్ మోసం.. నకిలీ ఫింగర్ ప్రింట్స్‌తో నగదు డ్రా.. ముఠా అరెస్ట్
హైదరాబాద్ నగరంలో సైబర్ నేరగాళ్ల రకరకాల మోసాలతో అమాయకమైన జనాలను బుట్టలో పడేసి వారి వద్ద నుండి లక్షల్లో డబ్బులు దోచుకుంటున్నారు.
By అంజి Published on 23 Nov 2023 11:45 AM ISTఇది నెక్ట్స్ లెవల్ మోసం.. నకిలీ ఫింగర్ ప్రింట్స్‌తో నగదు డ్రా.. ముఠా అరెస్ట్
హైదరాబాద్ నగరంలో సైబర్ నేరగాళ్ల రకరకాల మోసాలతో అమాయకమైన జనాలను బుట్టలో పడేసి వారి వద్ద నుండి లక్షల్లో డబ్బులు దోచుకుంటున్నారు. సైబర్ మోసగాళ్లు ఆరీతేరిపోయారు. ఇప్పుడు ఏకంగా నకిలీ వేలిముద్రల సహాయంతో నగదు డ్రా చేస్తూ హల్చల్ సృష్టిస్తున్నారు. నకిలీ ఫింగర్ ప్రింట్స్ ద్వారా నగదు డ్రా చేస్తున్న తొమ్మిది మంది సభ్యులు ఉన్న ముఠాలో ఆరుగురిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి ఫింగర్ ప్రింట్ మిషన్ 8 సెల్ ఫోన్లు సిమ్ కార్డులు ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. నకిలీ ఫింగర్ ప్రింట్స్ ద్వారా నగదు డ్రా చేస్తున్న ముఠాను అరెస్టు చేశామని సీసీఎస్ జాయింట్ సీపీ గజరావు భూపాల్ తెలిపారు.
నిందితులు అసాధారణ, ఉదయ్ కిరణ్, మహమ్మద్ ఆయాజ్, నరేంద్ర, శివకృష్ణ, శ్రీనులను అరెస్టు చేశామని జాయింట్ సీపీ తెలిపారు. రఫీ, యువరాజు, తరుణ్ ఈ ముగ్గురు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని సీసీఎస్ జాయింట్ సీపీ అన్నారు. అయితే వీరందరూ కలిసి మీసేవ సెంటర్ సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో డేటా తీసుకొని ఈ ముఠా మోసాలకు పాల్పడుతున్నారు. ఈ విధంగా నిందితులు డేటాలో ఫింగర్ ప్రింట్ తీసుకొని అమాయకమైన జనాలను మోసం చేస్తున్నారు. ఆధార్ ఎనేబుల్ సిస్టంలో ఈ ముఠా వెండర్ గా లాగినై ఆధార్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఉన్న ఫింగర్ ప్రింట్స్ తీసుకుని ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు.
డేటా ద్వారా తీసుకున్న నకిలీ ఫింగర్ ప్రింటర్స్ సృష్టించి గుట్టు చప్పుడు కాకుండా నగదును డ్రా చేస్తున్నట్లుగా గుర్తించామని సిసిఎస్ జాయింట్ సీపీ అన్నారు. 200 నుండి 300 వరకు లావాదేవీలు జరిపారు. ఈ ముఠా నకిలీ ఫింగర్ ప్రింట్స్ ద్వారా కేవలం నాలుగు రోజుల్లోనే 10 లక్షల రూపాయలను డ్రా చేశారు. అంతేకాదండోయ్ ఈ ముఠా సభ్యులు శీను అనే వ్యక్తికి జాబ్ ఇప్పిస్తామని చెప్పి బ్యాంక్ అధికారులతో వీడియో కాల్ చేయించారు. ఆధార్ వెరిఫికేషన్ పూర్తి అవ్వగానే మర్చంట్ ఐడి ఇచ్చారు. శీనుతో పాటు మరికొంత మందికి కూడా ఇలా మర్చంట్ ఐడి ఇప్పించి ఇటువంటి మోసాలకు పాల్పడుతున్నారు.
అయితే మర్చంట్ ఐడి ద్వారా నిందితులు అసాధారణ, రూపేష్ ఈ ఇద్దరు కలిసి సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో డేటాను తీసుకునేవారు. అనంతరం వీరు రబ్బర్ ఫింగర్ ప్రింట్స్ తయారు చేసి వాటి ద్వారా అమాయకుల అకౌంట్ లో ఉన్న నగదును డ్రా చేసేవారు. ఫిర్యాదుదారుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి మొత్తం ఆరుగురు సభ్యులు గల ముఠాను అరెస్టు చేసి వారి వద్ద నుండి 8 మొబైల్ ఫోన్లు మూడు ట్రాన్స్పరెంట్ పేపర్స్ 13 డెబిట్ కార్డ్స్ ఎనిమిది సిమ్ కార్డ్స్ ఒక పెన్ డ్రైవ్ రెండు లాప్టాప్స్ ఒక బయోమెట్రిక్ మిషన్ స్వాధీనం చేసుకున్నారు.