ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న హాస్టల్‌లో 12 మంది బాలికలపై అత్యాచారం జరిగిన కేసులో నల్గొండ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరాజు గురువారం కీలక తీర్పు చెప్పారు. బాలికలపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడికి, అతడికి సహకరించిన వారికి కఠిన కారాగార శిక్ష విధించారు. నిందితుడు రమావత్ హరీశ్ నాయక్‌కు జీవితఖైదు విధించిన కోర్టు.. అతడికి సహకరించిన శ్రీనివాస్‌కు జీవితఖైదు, అతడి భార్య సరితకు 6 నెలల జైలు శిక్ష విధించింది. కేసు వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా పెద్దవూర మండలం ఏనమీదితండాలో ఓ స్వచ్ఛంద సంస్థ బాలికల వసతిగృహాన్ని నడుపుతోంది. గుంటూరుకు చెందిన భార్యభర్తలు నన్నం శ్రీనివాసరావు, సరితలు విలేజ్ రీకన్‌స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ పేరుతో వసతి గృహాన్ని నడుపుతున్నారు. ఈ క్రమంలోనే వసతిగృహంలో ఉంటున్న బాలికలకు చదువు చెప్పేందుకు ట్యూటర్‌గా రమావత్ హరీశ్ నియమించారు.
అతడు రోజు అక్కడికి వచ్చే పాఠాలు చెప్పి వెళ్లేవాడు. కొన్ని రోజులకు అతడి బుద్ధి మారింది. అక్కడ ఉన్న 12 మంది మైనర్ బాలికలపై 3 నెలల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎదురు తిరిగితే చంపేస్తానంటూ బాలికలను బెదిరించాడు. దీనికితోడుగా నిందితుడికి శ్రీనివాసరావు, సరితలు సహకరించారు. బాధిత బాలిక ద్వారా 2014 ఏప్రిల్ 3వ తేదీన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలికలపై అత్యాచారం జరిగినట్లు గుర్తించినా పోలీసులు.. బాలికల ఫిర్యాదు మేరకు 12 కేసులను నమోదు చేశారు. నిందితుడిపై 12 కేసులలో ఛార్జిషీట్లను దాఖలు చేయగా.. కోర్టు విచారణలో 10 కేసులలో నేర నిర్దారణ అయ్యింది. దీంతో కోర్టు నిందితులకు జీవితఖైదు, రూ.10 వేల చొప్పున జరిమానా విధించింది.