వరంగల్: హన్మకొండలో దారుణ ఘటన వెలుగు చూసింది. నగరంలోని వడ్డేపల్లిలో తన ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై వరంగల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడు వరంగల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్‌పై పోక్సో కేసు నమోదైంది. ఈ ఘటన అక్టోబర్ 19వ తేదీన జరిగినప్పటికీ, బాలిక కాజీపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సెక్షన్లు 127 (2), 75 (2), 351 (2), BNS, 9 (a)v, 9 (c), r/w10 POCSO చట్టం 2012 కింద కేసులు నమోదు చేశారు.
బాలికను తన ఫ్లాట్‌కి రప్పించుకున్న సీఐ.. ఆ తర్వాత పరిస్థితిని సద్వినియోగం చేసుకునేందుకు ఆమె చేయి పట్టుకుని తన పడకగది వైపు లాగేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో బాధితురాలు సీఐని ప్రతిఘటించగా, ఫ్లాట్‌లో ఒంటరిగా ఉన్న ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ తర్వాత తన తల్లిదండ్రులకు చెప్పవద్దని రవికుమార్ ఆమెను బెదిరించి బలవంతంగా ఫోన్ నంబర్ తీసుకుని అధికారిక ఫోన్ నుంచి మిస్డ్ కాల్ ఇచ్చి వెరిఫై చేశాడు.
బాలికపై అత్యచారయత్నం చేయగా ఆమె తప్పించుకుని వెళ్లి తల్లిదండ్రులకు విషయం తెలిపింది. దీంతో బాలిక తల్లిదండ్రుల సహాయంతో కాజీపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈమేరకు సిఐ రవికుమార్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కాజీపేట సిఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. పూర్తి దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.