గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అరావళి జిల్లా అంబాజీలోని ప్రసిద్ధ షామ్లాజీ దేవాలయం సమీపంలో శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అంబాజీ దర్శనం కోసం రోడ్డుపై కొందరు భక్తులు నడుచుకుంటూ వెళ్తుండగా.. ఓ కారు వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో కొందరు గాల్లోకి ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంబులెన్స్‌లో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మృతి చెందిన వారు పంచమహల్ జిల్లాలోని కలోల్ వాసులు. రోడ్డుపై వెళ్తున్న ఇన్నోవా కారు అదుపుతప్పి ప్రజలపైకి దూసుకెళ్లింది. క్షతగాత్రులను మల్పూర్‌లోని సీహెచ్‌సీలో చేర్పించారు. ప్రమాదంలో కారు కూడా తీవ్రంగా దెబ్బతింది. కారు పరిస్థితి చూస్తేనే ప్రమాదం తీవ్రత అర్థమవుతుంది . కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. అంతకుముందు రక్షాబంధన్ రోజున ఆనంద్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటనలో బాధితులు రక్షా బంధన్ వేడుకలు జరుపుకుని తిరిగి వస్తున్నారు. కారు, ఆటో, బైక్ ఢీకొన్నాయి.