హైదరాబాద్: మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోరబండలో దారుణం చోటు చేసుకుంది. రాజీవ్‌గాంధీనగర్‌లో సోమవారం రాత్రి కుటుంబ కలహాల కారణంగా 32 ఏళ్ల మహిళను ఆమె భర్త హత్య చేసిన సంఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. బాధితురాలు సరస్వతిపై ఆమె భర్త ఆంజనేయులు రోకలిబండతో దాడి చేసి హత్య చేశాడు. అయితే భార్యపై అనుమానంతో ఆంజనేయులు తరచూ గొడవ పడేవాడని సమాచారం.
సోమవారం రాత్రి కూడా గొడవ జరగడంతో అది కాస్త హింసకు దారితీసిందని, ఆ సమయంలో ఆంజనేయులు రుబ్బు రాయిని తీసుకొని సరస్వతిపై దాడి చేశాడని, దీంతో ఆమె అక్కడికక్కడే మరణించిందని తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. హత్య కేసు నమోదు చేసి నిందితులను పట్టుకుని అరెస్టు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.