అమరావతి: స్కూల్‌కు వెళ్లి చదువుకోవాల్సిన బాలుడు ఆకతాయితనంగా ఉరేసుకోవడంతో ప్రాణాలు పోయాయి. ఈ ఘటన రాజధాని గ్రామం అనంతవరంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అనంతవరం గ్రామానికి చెందిన దంపతులకు ఇద్దరు సంతానం. రెండో కుమారుడు జిల్లా పరిషత్ స్కూల్‌లో చదువుతున్నాడు. నవంబర్ 21వ తేదీన ఇంట్లో ఎవరూ లేని టైంలో గదిలోకి వెళ్లి మంచంపైకి ఎక్కి తల్లి చీరను ఫ్యాన్‌కు కట్టి మెడకు గట్టిగా బిగించుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత అక్కడికి మరో బాలుడు వచ్చాడు. తన స్నేహితుడు ఉరివేసుకున్నాడంటూ గట్టిగా కేకలు వేస్తూ స్థానికులను పిలిచాడు.
స్థానికులు వెంటనే అక్కడకు చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని వెంటనే తుళ్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి షిఫ్ట్ చేశారు. అక్కడ 12 రోజుల పాటు వెంటిలేటర్‌పై మృత్యువుతో పోరాడిన బాలుడు చివరకు ప్రాణాలు విడిచాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహన్ని కుటుంభ సభ్యులకు అప్పగించారు. బాలుడు స్కూల్‌కు వెళ్లనని రోజూ మారం చేసేవాడని, తల్లిదండ్రులను బెదిరించాలనే ఇలా చీరతో ఉరి వేసుకుంటే అదికాస్తా బిగుసుకుపోయి ఇలా జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.