కర్ణాటకలోని హాసన్ జిల్లా గాంధీనగర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు చిన్నారులు సహా తొమ్మిది మంది మృతి చెందారు. శనివారం అర్థరాత్రి ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ కన్నడ జిల్లా ధర్మస్థలిలో మంజునాథ స్వామిని దర్శించుకుని టెంపో ట్రావెలర్‌లో తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 69పై ఈ ప్రమాదం జరిగింది. టెంపో ట్రావెలర్ కెఎస్‌ఆర్టీసీ బస్సు వెనుక ప్రయాణిస్తోంది. అదే మార్గంలో అకస్మాత్తుగా వస్తున్న పాల ట్యాంకర్‌ను గమనించిన టెంపో ట్రావెలర్ డ్రైవర్ వాహనాన్ని ఎడమవైపునకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించి బస్సును ఢీకొట్టాడు. అనంతరం వెనుక నుంచి ట్యాంకర్ టెంపో ట్రావెలర్‌ను ఢీకొట్టింది.
ప్రమాద సమయంలో టెంపోలో ఉన్న వారందరూ నిద్రలో ఉన్నారు. జంక్షన్‌లో వన్‌వేపై సూచిక బోర్డు లేకపోవడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. కేఎస్‌ఆర్‌టీసీ బస్సులోని ప్రయాణికులకు కూడా గాయాలయ్యాయి. ట్యాంకర్ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై బన్స్వారా పోలీసులు విచారణ చేపట్టారు. మృతులను లీలావతి (50), చైత్ర (33), సమర్థ (10), డింపి (12), తన్మయ్ (10), ధ్రువ (2), వందన (20), దొడ్డయ్య (60), భారతి (50)గా గుర్తించారు. టెంపో ట్రావెలర్‌లో 14 మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను హాసన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.