ఘోర ప్రమాదం : కలప ట్రక్కు-డీజిల్ ట్యాంకర్ ఢీ.. 9 మంది సజీవ దహనం
9 Charred to death as fire breaks out after tanker-truck collision.మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
By తోట వంశీ కుమార్ Published on 20 May 2022 8:27 AM GMT
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రాపూర్ వద్ద కలప లోడ్‌తో వెలుతున్న ట్రక్కును డీజిల్ ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో 9 మంది సజీవ దహనం అయ్యారు.
వివరాల్లోకి వెళితే.. గురువారం రాత్రి10.30గంటల సమయంలో చంద్రాపూర్-ముల్ రోడ్డుపై అజయ్‌పూర్ సమీపంలో డీజిల్ ట్యాంకర్, కలప లోడుతో వెళ్తున్న ట్రక్కు ఢీకొన్నాయి. దీంతో మంటలు చెలరేగాయి. డీజిల్, కలపకు మంటలు అంటుకోవడంతో క్షణాల్లో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. దీంతో ఆయా వాహనాల్లో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది సజీవ దహనం అయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. కొన్ని గంటల పాటు శ్రమించి అతి కష్టం మీద మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ఈ ఘటనపై చంద్రపూర్ సబ్ డివిజనల్ పోలీసు అధికారి సుధీర్ నందనవర్ మాట్లాడుతూ.. చంద్రపూర్ నగరం సమీపంలోని అజయ్‌పూర్ సమీపంలో కలప దుంగలను రవాణా చేస్తున్న ట్రక్కును డీజిల్ లోడ్ చేసిన ట్యాంకర్ ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత మంటలు చెలరేగాయి, దీంతో తొమ్మిది మంది అక్కడికక్కడే కాలిపోయారు. మృతుల్లో లారీ డ్రైవర్‌తోపాటు కూలీలు ఉన్నట్లు తెలిపారు. మృతదేహాలను చంద్రపూర్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
Maharashtra | Nine people including driver and labourers killed in a collision between two trucks on Chandrapur-Mul road in Chandrapur district
— ANI (@ANI) May 20, 2022