Hyderabad: కల్తీ కల్లు ఘటనలో 7కి చేరిన మరణాలు
హైదరాబాద్ కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య 7కు చేరింది.
By Knakam Karthik
Hyderabad: కల్తీ కల్లు ఘటనలో 7కి చేరిన మరణాలు
హైదరాబాద్ కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య 7కు చేరింది. బాధితులకు నిమ్స్, గాంధీ సహా ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ చికిత్స అందిస్తున్నట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రకటించారు. ఆరుగురికి డయాలసిస్ చేస్తున్నామని, మిగతా వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు స్పష్టం చేశారు.
ప్రస్తుతం 51 మంది చికిత్స పొందుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. నిమ్స్‌లో 34 మంది, గాంధీలో 15 మంది, ఒకరు ఈఎస్ఐ, మరొకరు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి మరణానికి కల్లులో ఆల్ఫ్రాజోలం కలపడమే కారణమని ఎక్సైజ్ అధికారులు తేల్చారు. ఈ మేరకు నాలుగు కల్లు దుకాణాల లైసెన్స్‌లను రద్దు చేసినట్టు తెలిపారు.
మరో వైపు కూకట్‌పల్లి కల్తీ కల్లు మృతుల బంధువుల తరఫున హైకోర్టు అడ్వకేట్ రామారావు ఇమ్మనేని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం మృతుల కుటుంబానికి రూ.10 లక్షలు, అనారోగ్యానికి గురైన వారికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్నారు. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కల్లు కాంపౌండ్ లను తనిఖీలు నిర్వహించి.. మళ్లీ ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కేసుపై స్పందించిన రాష్ట్ర మానవహక్కుల కమిషన్.. రాష్ట్ర ప్రభుత్వ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి వచ్చే నెల 20లోపు ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.