పంజాబ్ రాష్ట్రంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన లుథియానాలో చోటు చేసుకుంది. స్థానిక టిబ్బా రోడ్డులోని మునిసిపల్ చెత్త డంప్ యార్డ్ సమీపంలో ఓ కుటుంబం గుడిసెలో నిద్రిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఏసీపీ సురీందర్ సింగ్ తెలిపిన వివరాల మేరకు.. సురేష్ షని(55) రానా దేవి(50) దంపతులు జీవనోపాధి కోసం లూథియానా వలస వచ్చారు. వీరికి రాజేష్, మనీషా కుమారి(10), చందా కుమారి(8), గీతా కుమారి(6), సన్నీ(2) సంతానం. కాగా.. బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో వీరు నివసిస్తున్న గుడిసెకు మంటలు అంటుకున్నాయి. గాఢనిద్రలో ఉన్న వీరు ప్రమాదాన్ని గుర్తించలేకపోయారు. రాజేష్ వేరే ప్రాంతంలో నిద్రించడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేయగా.. అప్పటికే మిగిలిన అందరూ సజీవ దహనం అయ్యారు. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.