పోలీసుల అరాచకం.. మాంసం విక్రయదారులపై మూత్రవిసర్జన
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం వెలుగు చూసింది. ఇద్దరు మాంసం విక్రయదారులపై పోలీసులు దౌర్జన్యం చేశారు.
By అంజి Published on 17 March 2023 10:15 AM GMTపోలీసుల అరాచకం.. మాంసం విక్రయదారులపై మూత్రవిసర్జన
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం వెలుగు చూసింది. ఇద్దరు మాంసం విక్రయదారులపై పోలీసులు దౌర్జన్యం చేశారు. తూర్పు ఢిల్లీలోని షాహదారాలో ముగ్గురు ఢిల్లీ పోలీసు సిబ్బందితో సహా ఏడుగురు వ్యక్తులు ఇద్దరు మాంసం విక్రేతలను కొట్టి, వారి ముఖంపై మూత్ర విసర్జన చేసి, డబ్బులు దోచుకున్నారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఇద్దరు మాంసం వ్యాపారులు తమ కారులో వెళుతుండగా స్కూటర్‌ను ఢీకొట్టారు. ఈ సంఘటన మార్చి 7న ఆనంద్ విహార్ ప్రాంతంలో జరిగింది.
'గో రక్షకులు' అని చెప్పుకుంటున్న నిందితులు బాధితుల ముఖాలపై మూత్ర విసర్జన చేసి, చంపుతామని బెదిరించినట్లు పోలీసులు గురువారం తెలిపారు. బాధితులు వెంటనే పోలీసులను ఆశ్రయించినప్పటికీ నాలుగు రోజుల తర్వాత కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో పాల్గొన్న మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేశామని, ముగ్గురు పోలీసులను, వారిలో ఒక అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఘాజీపూర్ కబేళాకు మాంసం సరఫరా చేసే నవాబ్, ముస్తఫాబాద్‌లో నివాసం ఉంటున్న ఆయన తన బంధువు షోయబ్‌తో కలిసి కారులో ఇంటికి వెళుతుండగా ఆనంద్ విహార్ సమీపంలో స్కూటర్‌ను ఢీకొట్టాడు. ఎఫ్ఐఆర్ ప్రకారం.. వారు కారులో మాంసాన్ని తీసుకెళ్తున్నారు. స్కూటర్ డ్రైవర్ వారి నుంచి రూ.4వేలు నష్టపరిహారం డిమాండ్ చేశాడు. అప్పుడే అక్కడికి పోలీస్ వ్యాన్ వచ్చిందని, ఓ పోలీసు మాంసం విక్రేతల నుంచి రూ.2,500 తీసుకుని స్కూటర్ డ్రైవర్‌కు ఇచ్చాడని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
మాంసం సరఫరా చేసే వారి నుంచి రూ.15వేలు డిమాండ్ చేసి, చెల్లించకుంటే పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్తానని బెదిరించాడని పోలీసులు తెలిపారు. పోలీస్ వ్యాన్‌లోని పోలీసులు మరో నలుగురిని పిలిచి ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లారని బాధితులు తెలిపారు. నవాబ్, షోయబ్‌లను నిందితులు నిర్బంధించి కొట్టారు. కత్తి చూపించి చేతులు కోసేస్తామని బెదిరించారు. నిందితులు వారి ముఖాలపై మూత్ర విసర్జన చేసి చంపేస్తామని బెదిరించారు. పోలీసులు గోవులను వధిస్తున్నారని ఆరోపిస్తూ తమను చంపిన తర్వాత మృతదేహాలను కాలువలో పడవేస్తామని బెదిరించారు.
పోలీసులు బాధితుల నుంచి రూ.25,500 వసూలు చేశారు. తమ శరీరంలోకి నార్కోటిక్ వంటి పదార్థాన్ని ఇంజెక్ట్ చేసి ఖాళీ పత్రాలపై సంతకాలు కూడా తీసుకున్నారని బాధితులు ఆరోపించారు. బాధితులకు కాళ్లు, వీపుపై గాయాలయ్యాయని, వారిని జీటీబీ ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. దోపిడీ, స్వచ్ఛందంగా గాయపరిచారనే ఆరోపణలపై మార్చి 10న నిందితులపై కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు. ఫిర్యాదుదారుల ఆరోపణలను తాము ధృవీకరిస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. అయితే, ప్రాథమిక విచారణ ప్రకారం, ముగ్గురు పోలీసులపై శాఖాపరమైన చర్యలు ప్రారంభించినట్లు, విచారణ వరకు సస్పెండ్ చేసినట్లు అధికారి తెలిపారు.