హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు
పాట్నా జంక్షన్ రైల్వే స్టేషన్‌కు సమీపంలోని ఓ హోటల్‌లో గురువారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
By అంజి Published on 25 April 2024 3:35 PM ISTహోటల్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు
బిహార్ రాష్ట్రంలోని పాట్నా జంక్షన్ రైల్వే స్టేషన్‌కు సమీపంలోని ఓ హోటల్‌లో గురువారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. నలుగురు మహిళల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక సిబ్బంది 20 మందికి పైగా ప్రజలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం నెలకొంది. మృతుల గుర్తింపులు ఇంకా ధృవీకరించబడలేదు. ఘటనా స్థలంలో రెండు హైడ్రాలిక్ ప్లాట్‌ఫారమ్‌లు మరియు ఇరవై ఫైర్ ఇంజన్లు ఉన్నాయి. పలు స్టేషన్లకు చెందిన పోలీసు అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
పాల్ హోటల్, పక్కనే ఉన్న హోటల్ పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రస్తుతం భవనం నుంచి 30 మందికి పైగా సురక్షితంగా బయటపడ్డారని డీఐజీ ఫైర్‌మెన్ మృత్యుంజయ్ చౌదరి తెలిపారు. ఈ సంఘటన ఎంత భయానకమైనది, హోటల్ కింద పార్క్ చేసిన డజను వాహనాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. ఘటనా స్థలానికి ఆరు అంబులెన్స్‌లను రప్పించారు. హోటల్‌లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే మంటలు చెలరేగాయని స్థానికులు చెబుతున్నారు. హోటల్ సమీపంలోని అన్ని భవనాలపై ఫైర్ ఆడిట్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న హోంగార్డు, ఫైర్ సర్వీసెస్ డీజీ శోభా ఓహత్కర్ విలేకరులతో మాట్లాడుతూ.. “మేము 16,000 కంటే ఎక్కువ హోటళ్లలో ఫైర్ ఆడిట్ చేసాము. అది ఇంకా కొనసాగుతోంది, వారికి ఫైర్ ఆడిట్‌లో నిర్దిష్ట సూచనలు ఇవ్వబడ్డాయి. కొందరు సూచనలను పాటించడం లేదు. ఈ ప్రమాదాన్ని చూస్తుంటే.. సిలిండర్ పేలుడు కారణంగా మంటలు చెలరేగినట్లు కనిపిస్తోంది" అని అన్నారు. "మేము మంటలను అదుపులోకి తెచ్చాము, దాని గురించి ఉదయం 11 గంటలకు సమాచారం అందింది. సరైన విచారణ ద్వారా ఖచ్చితమైన కారణం కనుగొనబడుతుంది. తగిన చర్య అనుసరించబడుతుంది" అని తెలిపారు.