గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భావ్‌నగర్-తాలాజా హైవేపై ప్రైవేట్ బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. తలాజా తాలూకాలోని త్రపాజ్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన 10 మందిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న 108, పోలీసు కాన్వాయ్ ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తదుపరి విచారణ జరుపుతున్నారు.
పోలీస్ సూపరింటెండెంట్ హర్షద్ పటేల్ ప్రకారం.. గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలో ఒక ప్రైవేట్ బస్సు, డంపర్ ట్రక్కు ఢీకొన్నట్లు తెలిపారు.. ఉదయం 6 గంటలకు బస్సు భావ్‌నగర్ నుండి మహువ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు.. డంపర్ లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. ఢీకొనడం వల్ల బస్సు కుడి ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నదని అధికారులు తెలిపారు.