పండ‌గ పూట విషాదం.. రోడ్డు ప్ర‌మాదంలో ఆరుగురు దుర్మ‌ర‌ణం

6 Dead after car rams into auto rickshaw motorbike in Gujarat's Anand.రాఖీ పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. సోద‌రుడికి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Aug 2022 8:14 AM IST
పండ‌గ పూట విషాదం.. రోడ్డు ప్ర‌మాదంలో ఆరుగురు దుర్మ‌ర‌ణం

రాఖీ పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. సోద‌రుడికి రాఖీ క‌ట్టామ‌న్న ఆనందంలో తిరుగు ప్రయాణ‌మైన ఆ సోద‌రిమ‌ణుల‌ను మృత్యువు ప్ర‌మాదం రూపంలో క‌బ‌లించింది. వేగంగా దూసుకువ‌చ్చిన కారు.. ఆటోను, ద్విచ‌క్ర‌వాహ‌నాన్ని ఢీ కొట్టింది. గుజ‌రాత్ రాష్ట్రంలో జ‌రిగిన ఈ ప్ర‌మాదంలో ఆరుగురు దుర్మ‌ర‌ణం చెందారు.

వివ‌రాల్లోకి వెళితే.. గురువారం రాత్రి ఆనంద్ జిల్లా సోజిత్రా తహసీల్ పరిధిలోని దాలీ గ్రామ స‌మీపంలో వేగంగా వెలుతున్న కారు.. ముందున్న ఆటో రిక్షా, బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు వ్య‌క్తులు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోగా మ‌రో ఐదుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు అక్క‌డ‌కు చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం సోజిత్రా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ మ‌రో న‌లుగురు మ‌ర‌ణించారు. దీంతో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. కారు డ్రైవ‌ర్ కు చికిత్స కొన‌సాగుతోంది.

దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కారు డ్రైవ‌ర్ మ‌ద్యం మ‌త్తులో ఉండ‌ట‌మే ప్ర‌మాదానికి కార‌ణంగా ప్రాథ‌మికంగా నిర్థార‌ణ‌కు వ‌చ్చారు. సోజిత్రా నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే పునంభాయ్ మాధభాయ్ పర్మార్ అల్లుడు ఖేతన్ పాధియార్ కారు న‌డిపిన‌ట్లు తెలుస్తోంది.

ఇక‌.. మృతులను సోజిత్రాలోని నవగఢ్ గ్రామానికి చెందిన జియాబెన్ మిస్త్రీ, జాన్వీబెన్ మిస్త్రీ, వారి తల్లి వినబెన్ మిస్త్రీ, ఆటోరిక్షా డ్రైవర్ యాసన్ వోహ్రా, ఆనంద్‌లోని యోగేష్ ఓడ్ మరియు సందీప్ ఓడ్‌గా గుర్తించారు. జియాబెన్ మిస్త్రీ, జాన్వీబెన్ మిస్త్రీలు త‌ల్లి విన‌బెన్ మిస్త్రీతో క‌లిసి సోద‌రుడికి రాఖీ క‌ట్టి తిరిగి వ‌స్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది.

Next Story