క్షుద్రపూజలు చేస్తున్నారన్న ఆరోపణలతో ఓ కుటుంబంపై పలువురు దాడికి పాల్పడ్డారు. అనంతరం వారి చేత మానవ వ్యర్థాన్ని తినిపించి, మూత్రం తాగించారు. ఈ అత్యంత అమానవీయ ఘటన జార్ఖండ్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుమ్కాలోని సరియాహత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అశ్వరి గ్రామంలో ఈ ఘటన జరిగింది. క్షుద్రపూజలు చేస్తున్నారని ఓ కుటుంబంపై పలువురు ఇనుప రాడ్లతో దాడి చేసి చిత్రహింసలు పెట్టారు. బాధితుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. మహిళలను దారుణంగా కొట్టారని, నలుగురినీ సరైయాహత్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
''నలుగురిని సరయ్యహత్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చేర్చారు. అనంతరం వారిని తదుపరి చికిత్స నిమిత్తం దేవఘర్‌కు తరలించారు. ముగ్గురు మహిళలను దారుణంగా కొట్టారు, ఆ తర్వాత నలుగురినీ పట్టుకుని వారి నోటిలో మలమూత్రాలను బలవంతంగా పోశారు'' అని ఇన్‌స్పెక్టర్ ఎన్‌కె సింగ్ అన్నారు. అమానవీయ చర్యకు పాల్పడిన ఆరుగురిపై బాధితురాలు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఇవ్వడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. నిందితులందరినీ విచారిస్తున్నామని సింగ్ తెలిపారు.
'వాళ్లు చేసిన క్షుద్రపూజలతో.. మా బిడ్డ ఆరోగ్యం చెడిపోయింది. అందుకే ఇలా చేశాము,' అని విచారణలో భాగంగా పోలీసులకు నిందితులు చెప్పినట్టు తెలుస్తోంది. గ్రామంలో పరిస్థితి సాధారణంగానే ఉందని, అయితే ఇక్కడ ఇంకా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు. మంత్రగత్తె నిషేధ చట్టం 3/4, దాడి కింద ఫిర్యాదు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.