ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై 40 మంది ప్రయాణిస్తున్న స్లీపర్ కోచ్ బస్సు ప్రమాదవశాత్తూ డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలోనే వెనుక వస్తున్న కారు బస్సును ఢీకొట్టింది. ఢీకొనడంతో బస్సు డీజిల్ ట్యాంక్‌కు మంటలు అంటుకున్నాయి. మంటలు చెలరేగడంతో కారులో ఉన్న ఐదుగురు బయటకు వచ్చే అవకాశం లేకపోయింది. జిల్లా మేజిస్ట్రేట్ (డిఎం), సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ (ఎస్‌ఎస్‌పి) సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ ఘటనలో ఐదుగురు సజీవ దహనమయ్యారని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మధుర శైలేష్ దూబే తెలిపారు. సోమవారం ఉదయం మథురలోని మహావాన్ ప్రాంత పరిధిలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో గాయపడిన కొందరు ప్రయాణికులను చికిత్స నిమిత్తం తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సు బీహార్ నుంచి ఢిల్లీ వైపు వెళుతోంది. బస్సులోని ప్రయాణికులందరూ సురక్షితంగా బయట పడగా, కారులో ప్రయాణిస్తున్న వారందరూ కారులోనే సజీవ దహనమయ్యారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటనలో మృతులకు సంతాపం తెలిపారు. బాధితుల బంధువుల కోసం తగిన ఏర్పాట్లు చేయాలని మధురలోని అధికారులను ఆదేశించారు.