గురువారం పాట్నాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య చికిత్స తీసుకుంటున్న వ్యక్తిని కాల్చి చంపారు. పెరోల్‌పై వచ్చిన ఖైదీపై ఐదుగురు గుర్తు తెలియని దుండగులు అనేకసార్లు కాల్పులు జరిపారు. రాజా బజార్ ప్రాంతంలోని పరాస్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. బక్సర్ జిల్లాలో జరిగిన హత్య కేసులో నిందితుడైన చందన్ మిశ్రా అనే బాధితుడు బ్యూర్ జైలు నుండి మెడికల్ పెరోల్‌పై విడుదలై చికిత్స కోసం ఆసుపత్రిలో చేరాడు. కొందరు వ్యక్తులు ఆయుధాలతో ఆసుపత్రి కారిడార్‌లోకి ప్రవేశించి, చందన్ మిశ్రా ఉన్న ఐసీయూ గదిలోకి వెళ్లారు. అతనిపై అనేక రౌండ్లు కాల్పులు జరిపి, అక్కడ్నించి పరారయ్యారు.
మృతుడు చందన్ మిశ్రా, బక్సర్ జిల్లాకు చెందిన వ్యక్తి. 2011లో రాజేంద్ర కేసరి అనే వ్యాపారి హత్య కేసులో దోషిగా తేలి బియూర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అతను వైద్య కారణాలతో 15 రోజుల పెరోల్‌పై ఆసుపత్రిలో చేరాడు. ఆసుపత్రి కారిడార్ లోపల ఉన్న సీసీటీవీ ఫుటేజీలో ఐదుగురు సాయుధ వ్యక్తులు చందన్ మిశ్రా గదిలోకి చొరబడి అతనిపై కాల్పులు జరుపుతున్నట్లు కనిపించింది. దాడి తర్వాత, ఐదుగురు దుండగులు ఆసుపత్రి ఆవరణ నుండి పారిపోయారు.
బక్సర్ పోలీసుల సహాయంతో కాల్పులు జరిపిన వారిని గుర్తించడానికి పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించాయి. ఆసుపత్రి భద్రతలో లోపాలు, ఆసుపత్రి గార్డుల పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.