మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణీకులతో వెలుతున్న బస్సు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 28 మంది మృతి చెందగా.. ఏడుగురిని కాపాడారు. మరో 19 మంది ప్రయాణీకులు గల్లంతయ్యారు. ఈ విషాద ఘటన మంగళవారం తెల్లవారుజామున మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. సిధి నుంచి సత్నాకు 54 మంది ప్రయాణీకులతో బస్సు వెలుతోంది.
వేగంగా వెలుతున్న బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. కాలువలో నీటి ప్రవాహాం ఎక్కువగా ఉండడంతో.. కొంతదూరం బస్సు కొట్టుకుపోయింది. కాలువలోకి బస్సు పడిపోవడాన్ని గమనించిన స్థానికులు.. ప్రయాణీకుల్లో ఏడుగురిని కాపాడారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 28 మంది ప్రాణాలు కోల్పోయారు. క్రేన్ సహాయంతో కాలువలోంచి బస్సును బయటకు తీశారు. ఈ ప్రమాదంలో గల్లంతైన 19 మంది కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాలువకు నీటి విడుదలను ఆపేశారు.
సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ దిగ్ర్భాంతి..
ఈ ప్రమాద ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని పోలీసులను ఆదేశించారు.