ఘోర ప్ర‌మాదం.. పెళ్లి బృందంతో వెలుతున్న బ‌స్సు బోల్తా.. 32 మంది దుర్మ‌ర‌ణం

32 Killed as bus falls into deep gorge in Uttarakhand's Kotdwar.ఉత్త‌రాఖండ్ రాష్ట్రంలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Oct 2022 11:27 AM IST
ఘోర ప్ర‌మాదం.. పెళ్లి బృందంతో వెలుతున్న బ‌స్సు బోల్తా.. 32 మంది దుర్మ‌ర‌ణం

ఉత్త‌రాఖండ్ రాష్ట్రంలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. పెళ్లిబృందంతో వెలుతున్న బ‌స్సు అదుపుత‌ప్పి లోయ‌లో ప‌డి పోయింది. ఈ ప్ర‌మాదంలో 32 మంది దుర్మ‌ర‌ణం చెంద‌గా.. మ‌రో 20 మంది గాయ‌ప‌డ్డారు.

55 మంది పెళ్లి బృందంతో హ‌రిద్వార్ జిల్లాలోని లాల్‌ఢాంగ్ నుంచి బీర్ఖల్ బ్లాక్‌కు వెలుతుండ‌గా పౌడీ జిల్లాలోని ధూమకోట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిమ్ది గ్రామ సమీపంలో బస్సు అదుపు తప్పి 500 మీట‌ర్ల లోతైన నాయర్ నది లోయలో ప‌డిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ధుమ్‌కోట్ పోలీసులు సహాయక కార్యక్రమాలు చేపట్టారు. మంగ‌ళ‌వారం రాత్రి ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది.

చీక‌టి కార‌ణంగా స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు ఆటంకాలు ఏర్ప‌డ్డాయి. ప్ర‌మాదస్థ‌లిలో ఎటువంటి వెలుతురు లేక‌పోవ‌డంతో చుట్టుప‌క్క‌ల గ్రామాల ప్ర‌జ‌లు సెల్‌ఫోన్ల ఫ్లాష్‌లైట్ల వెలుగులో బ‌స్సులో చిక్కుకుపోయిన వారిని బ‌య‌ట‌కు తీశారు. క్ష‌త‌గాత్రుల‌ను స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఘ‌ట‌నాస్థ‌లంలోనే 25 మంది చ‌నిపోగా.. మిగిలిన వారు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు. క్ష‌త‌గాత్రుల్లో ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు వైద్యులు చెబుతున్నారు. దీంతో మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది.

ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ, ఉత్త‌రాఖండ్ సీఎం పుష్క‌ర్ సింగ్ ధామి విచారం వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు సానుభూతి తెలియ‌జేశారు. వారికి అండ‌గా ఉంటామ‌ని భ‌రోసా ఇచ్చారు.

ఈ ఏడాది జూన్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఉత్తరకాశీ జిల్లాలో బస్సు 250 మీటర్ల లోతైన లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాకు చెందిన 25 మంది మ‌ర‌ణించారు.

Next Story