మహారాష్ట్రలోని థానేలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆన్‌లైన్ పబ్‌జీ గేమ్ ఆడిన తర్వాత జరిగిన గొడవలో స్నేహితుడిని చంపారు ముగ్గురు వ్యక్తులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం 20 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసి ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నారని ఒక అధికారి తెలిపారు. వర్తక్ నగర్ ప్రాంతంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. నలుగురు స్నేహితులు తరచూ పబ్జీ గేమ్ ఆడుతూ, ఆ తర్వాత ఏదో ఒక సమస్యపై గొడవ పడుతుండేవారని వర్తక్ నగర్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ సదాశివ నికమ్ తెలిపారు.
సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో నలుగురు కలిసి మళ్లీ గేమ్ ఆడి మద్యం సేవించారు. వారు మళ్లీ గొడవ పడ్డారు. వారిలో ముగ్గురు తమ స్నేహితుడు సయీల్ జాదవ్‌ను పదునైన కత్తితో పొడిచారని అధికారి తెలిపారు. బాధితుడు అక్కడికక్కడే మృతి చెందగా, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించిన పోలీసులు మంగళవారం నిందితుడిని అరెస్ట్ చేసి ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకుని వారిపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు. పబ్జీ అనేది ఆన్‌లైన్ మల్టీ-ప్లేయర్ గేమ్. ప్రజలు దీనికి బానిసలుగా మారుతున్నట్లు అనేక ఫిర్యాదులు ఉన్నాయి. ఇది మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందనే భయాలు ఉన్నాయి.