రాజస్థాన్ రాష్ట్రం ఝున్‌ఝున్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని ఉదయపూర్వతి పోలీస్‌స్టేషన్ పరిధి తోడ్పూర గ్రామంలో నలుగురు చిన్నారులు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు మట్టిలో కూరుకుపోయారు. దీంతో ముగ్గురు చిన్నారులు మృతి చెందగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
జరిగిన ఘటనపై ఎస్పీ మనీష్ త్రిపాఠి మాట్లాడుతూ.. తోడ్పూర గ్రామంలో టన్నెల్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఆ ప్రాంతంలోనే స్థానికంగా ఉండే నలుగురు చిన్నారులు ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా మట్టి కూరుకుపోవడంతో అందులో నలుగురు చిన్నారులు చిక్కుకుపోయారు. ప్రమాద సమయంలో వీరికి దూరంగా ఉన్న మరో బాలుడు గమనించి కుటుంబీకులకు సమాచారం అందించాడని తెలిపారు.
వెంటనే స్పందించిన కుటింబీకులు మట్టిలో నుంచి వారిని వెలికి తీయగా అప్పటికే ముగ్గురు పిల్లలు మృత్యువాతపడ్డారు. మృతులను నిషా(10), ప్రిన్స్(7), కృష్ణ(7)గా గుర్తించినట్లు పేర్కొన్నారు. మరొకరు ప్రాణాలతో బయటపడగా.. చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతున్న బాలుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడని తెలిపారు. జరిగిన ఘటనతో షాక్‌కు గురైనట్లు ఎస్పీ తెలిపారు.