హైదరాబాద్‌లోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమ పేరిట జరిగిన వంచన ఒక యువతి ప్రాణాలను బలితీసుకుంది. వనస్థలిపురంలోని ఒక డీమార్ట్‌లో గత నాలుగేళ్లుగా పనిచేస్తున్న సువర్ణ (28), అదే సంస్థలో పనిచేసే రాకేష్‌తో ప్రేమలో పడింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన రాకేష్, ఏడాది కాలంగా ఆమెతో సన్నిహితంగా ఉంటూ శారీరక సంబంధం పెట్టుకున్నాడు.
ఈ క్రమంలో ఈ నెల 17న ఆమెను ఇంటి నుండి తీసుకెళ్లి ఒక గదిలో ఉంచిన నిందితుడు, పది రోజుల తర్వాత తన కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకోవడం లేదని తెగేసి చెప్పాడు. ఈ నెల 27న ఆమెను ఇంటి వద్ద వదిలేసి వెళ్లిపోవడంతో, తీవ్ర మనస్తాపానికి గురైన సువర్ణ 28వ తేదీ రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి సోదరుడు విజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బాలాపూర్ పోలీసులు, నిందితుడు రాకేష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.