కాల్వ‌లో శ‌వ‌మై తేలిన నిఖిల్‌.. ప్రేమ వ్య‌వ‌హార‌మే కార‌ణ‌మా..?

25 Year old man suspicious dead in Suryapet.సూర్యాపేట జిల్లాలో యువ‌కుడు అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Oct 2022 3:49 PM IST
కాల్వ‌లో శ‌వ‌మై తేలిన నిఖిల్‌.. ప్రేమ వ్య‌వ‌హార‌మే కార‌ణ‌మా..?

సూర్యాపేట జిల్లాలో యువ‌కుడు అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందాడు. రెండు రోజుల కింద‌ట అదృశ్య‌మైన యువ‌కుడు కాలువ‌లో శ‌వ‌మై క‌నిపించాడు. ప్రేమ వ్య‌వ‌హ‌రం కార‌ణంగానే త‌మ కుమారుడిని హ‌త్య చేశార‌ని మృతుడి త‌ల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇది పరువు హత్యేనని, కుల దురహంకారంతో హత్య చేశారని గిరిజన సంఘాలు ఆందోళనకు దిగాయి. దీంతో స్థానికంగా ఉద్రిక్త‌త నెల‌కొంది.

సూర్యాపేట పట్టణంలోని విద్యాన‌గ‌ర్ కాల‌నీకి చెందిన అడ్వొకేట్, మాజీ కౌన్సిలర్ దరావత్ భాస్కర్‌కు కుమారుడు నిఖిల్ (24) హైద‌రాబాద్‌లో ఉంటూ ఇటీవ‌ల ఎల్ఎల్‌బీ పూర్తి చేసి ద‌స‌రా పండుగ‌కు ఇంటికి వ‌చ్చాడు. ఆదివారం(అక్టోబ‌ర్ 9) స్నేహితుడి పుట్టిన రోజు వేడుక‌లు అని చెప్పి ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లాడు. ఓ హోట‌ల్‌లో గ‌దిని అద్దెకు తీసుకుని అర్థ‌రాత్రి వ‌ర‌కు వేడుక‌లు జ‌రుపుకున్నారు. రాత్రి 11 గంట‌ల ప్రాంతంలో త‌ల్లి కోట‌మ్మ ఫోన్ చేయ‌గా.. కొద్ది సేప‌టిలో వ‌స్తాన‌ని చెప్పాడు. ఎంత‌సేప‌టికి నిఖిల్ రాక‌పోవ‌డంతో మ‌రోసారి ఫోన్ చేయ‌గా స్విచ్ఛాఫ్ వ‌చ్చింది. ఆందోళ‌న చెందిన కుటుంబ స‌భ్యులు సోమ‌వారం ఉద‌యం పోలీసుల‌ను ఆశ్ర‌యించారు.

మంగ‌ళ‌వారం ఉద‌యం ఆర్‌కే మేజ‌ర్ కాలువ‌లో గుర్తు తెలియ‌ని మృతదేహం కొట్టుకువ‌స్తుండ‌గా రైతులు గ‌మ‌నించి పోలీసుల‌కు స‌మాచారం అందించారు. సోష‌ల్ మీడియా ద్వారా స‌మాచారం తెలుసుకున్న నిఖిల్ త‌ల్లిదండ్రులు అక్క‌డ‌కు చేరుకుని చ‌నిపోయింది త‌మ కుమారుడేన‌ని నిర్థార‌ణ చేసుకున్నారు. పార్టీ పేరుతో పిలిచి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు.

నిఖిల్ ఇంట‌ర్ చదివే సమయంలో తన క్లాస్‌మేట్ అయిన ఓ అమ్మాయితో చనువుగా ఉండేవాడని, అగ్ర కులానికి చెందిన ఆ అమ్మాయి బంధువులు పలుమార్లు నిఖిల్‌ను బెదిరించారని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఆ యువ‌తి మామ త‌మ కుమారుడి కొట్టాడ‌ని నిఖిల్ త‌ల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు.. యువ‌తి తండ్రి లేదా యువ‌తితో స‌న్నిహితంగా ఉండే మ‌రెవ‌రు అయినా హ‌త్య చేసి ఉంటారా..? అన్న కోణంలో ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story